ఓటు కోసం వెళితే పెళ్లి ప్రపోజల్స్‌.. | AAPs Delhi Candidate Flooded By Marriage Proposals | Sakshi
Sakshi News home page

ఓటు కోసం వెళితే పెళ్లి ప్రపోజల్స్‌..

Published Wed, Feb 5 2020 4:06 PM | Last Updated on Wed, Feb 5 2020 4:09 PM

AAPs Delhi Candidate Flooded By Marriage Proposals - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ అభ్యర్ధిగా బరిలో నిలిచిన రాఘవ్‌ చదాకు ఓట్ల సంగతేమో కానీ పెళ్లి సంబంధాలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. ప్రచారంలో భాగంగా ఆయన ఎక్కడికి వెళ్లినా పెళ్లి ప్రపోజల్స్‌తో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరి ఇవి ఓట్ల రూపంలో ఎంతవరకూ మారతాయో తెలియకపోయినా ఇప్పటివరకూ కనీసం 12 పెళ్లి ప్రతిపాదనలు ముందుకొచ్చాయని ఆయన సోషల్‌ మీడియా బృందం వెల్లడించింది. వృత్తి రీత్యా సీఏ అయిన 31 సంవత్సరాల రాఘవ్‌ చదా ఢిల్లీలోని రాజిందర్‌ నగర్‌లో ఆప్‌ అభ్యర్ధిగా ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజూ పలు రోడ్‌షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటున్న క్రమంలో ఆయా సభల ఫోటోలు, వీడియోలను ఆయన సోషల్‌ మీడియా టీం తన ఇన్‌స్టాగ్రాం, ట్విటర్‌ ఖాతాల్లో పోస్ట్‌ చేస్తోంది. మహిళా ఫాలోయర్ల నుంచి చదాకు పెళ్లి ప్రపోజల్స్‌ వస్తున్నాయని ఆయన సోషల్‌మీడియా బృందం పేర్కొంది.

మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ఓ మహిళా ఫాలోయర్‌ చదాకు ప్రపోజ్‌ చేయగా, ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ బాగాలేనందున పెళ్లి చేసుకునేందుకు ఇది సరైన సమయం కాదని చదా తెలివిగా బదులిచ్చారని తెలిపింది. ప్రచారంలో భాగంగా ఆయన ఓ స్కూల్‌కు వెళ్లగా అక్కడున్న టీచర్‌ ఒకరు తనకు కుమార్తె ఉంటే మీకిచ్చి వివాహం చేసేదాన్నని చదాతో చెప్పుకొచ్చారని ఆయన సోషల్‌ మీడియా బృందం పేర్కొంది. ఇక ‘మీకు పెళ్లి ప్రపోజల్స్‌ వస్తున్నా మీరు పెళ్లి మాత్రం చేసుకోవద్దని అలా చేస్తే తన గుండె ముక్కలవుతుంద’ని ఓ మహిళ ఆప్‌ నేత ఇన్‌స్టాగ్రాంలో ఆయనను వేడుకున్నారు. ట్విటర్‌లో మరో మహిళ చదాను ఉద్దేశించి మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ ఎరౌండ్‌ అంటూ ఓ స్టోరీని షేర్‌ చేశారు. చదాపై బీజేపీ సీనియర్‌ నేత ఆర్‌పీ సింగ్‌ పోటీచేస్తుండగా, కాంగ్రెస్‌ నుంచి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనే అత్యంత పిన్న వయసు కలిగిన పాతికేళ్ల రాకీ తుసీడ్‌ బరిలో నిలిచారు.

చదవండి : మోదీ తాజ్‌మహల్‌ను కూడా అమ్మేస్తారు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement