ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి ధీమా వ్యక్తం చేశారు. శనివారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ఆయన తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 50కి పైగా సీట్లను గెలుచుకొని, తమ పార్టీ జాతీయ రాజధానిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. అన్ని వైపులనుంచి ఆ ప్రకంపనలు తనకు వినిపిస్తున్నాయనీ, బీజీపీ తప్పక విజయం సాధిస్తుందని తన సిక్స్త్ సెన్స్ చెబుతోందంటూ జోస్యం చెప్పారు.
ఢిల్లీ ప్రజల ఆశీస్సులతో తమ విజయం తథ్యమని తివారి వెల్లడించారు. అంతేకాదు ప్రజల ఆశీర్వాదాలు ప్రధాని మోదీకి ఉన్నాయనీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయ మన్నారు. ఢిల్లీ ప్రజలు తమకే పట్టం గడతారనీ, తమ విజయం కోసం ఎదురు చూస్తున్నామని తివారి వెల్లడించారు. అయితే, బీజేపీ అధికారంలోకి వస్తే మీరు సీఎం అవుతారా అన్న ప్రశ్నకు సమాధానాన్ని దాటవేసిన ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు చెప్పడానికి నిరాకరించారు.
కాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఈ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 70 అసెంబ్లీ స్థానాలకు గాను 67 సీట్లను గెలుచుకోగా, బీజేపీ మూడు స్థానాలను మాత్రం దక్కించుకుంది. కాంగ్రెస్‌కు ఒక్కస్థానం కూడా దక్కలేదు. మరోవైపు గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ఏడు స్థానాలను దక్కించుకోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment