సాక్షి, న్యూఢిల్లీ: ఎలాంటి గందరగోళం, ఉత్కంఠ లేదు. వార్ వన్ సైడ్ అయింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను మించిన ఫలితాలతో సామాన్యుడి ఆమ్ ఆద్మీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఢిల్లీలోని మొత్తం70 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ 62 చోట్ల గెలుపొందగా.. బీజేపీ 8 స్థానాలతోనే సరిపెట్టుకుంది. కాగా.. ఆప్ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా భారీ మెజార్టీతో గెలుపొందారు. రాజేందర్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాఘవ్.. బీజేపీ అభ్యర్థి ఆర్పీ సింగ్‌పై 20వేల 58ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
(హస్తిన తీర్పు : ఆప్ 62.. బీజేపీ 8)
ఎన్నికల ప్రచారం సమయంలో రాఘవ్ చద్దాకు వింత అనుభవాలు ఎదురైన సంగతి తెల్సిందే. ఎన్నికల ప్రచారం సమయంలో ఓటర్ల నుంచి నియోజకవర్గ సమస్యల గురించి వినతులు వస్తుంటాయి. కానీ, రాఘవ్ చద్దాకు మాత్రం పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి. ఆయన ప్రచారంలో పాల్గొన్న సమయంలో..'మీరు చాలా బాగున్నారు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ఓ మహిళా ఫాలోవర్ చద్దాకు ప్రపోజ్ చేయగా, ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ బాగాలేనందున పెళ్లి చేసుకునేందుకు ఇది సరైన సమయం కాదని చద్దా తెలివిగా బదులిచ్చిన విషయం తెలిసిందే. ప్రచారంలో భాగంగా ఆయన ఓ స్కూల్‌కు వెళ్లగా అక్కడున్న టీచర్ ఒకరు తనకు కుమార్తె ఉంటే మీకిచ్చి వివాహం చేసేదాన్నని చద్దాతో చెప్పుకొచ్చారని ఆయన సోషల్ మీడియా బృందం పేర్కొంది. (ఓటు కోసం వెళితే పెళ్లి ప్రపోజల్స్..)
ఇక ‘మీకు పెళ్లి ప్రపోజల్స్ వస్తున్నా మీరు పెళ్లి మాత్రం చేసుకోవద్దని అలా చేస్తే తన గుండె ముక్కలవుతుంద’ని ఓ మహిళ ఆప్ నేత ఇన్‌స్టాగ్రాంలో ఆయనను వేడుకున్నారు. ట్విటర్‌లో మరో మహిళ చద్దాను ఉద్దేశించి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎరౌండ్ అంటూ ఓ స్టోరీని షేర్ చేశారు. సీఏగా కెరీర్ ప్రారంభించిన రాఘవ్ చద్దా తరువాత రాజకీయాలోకి ప్రవేశించారు. తదనంతరం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీలో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సౌత్ ఢిల్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలో అతను గెలుపొందడంతో, ఇదంతా ఆ అమ్మాయిల వల్లే అంటూ కొందరు చమత్కరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment