మాజీ డిప్యూటీ సీఎంపై ఏసీబీ కేసు
మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఛగన్ భుజ్‌బల్, మరో 11 మందిపై అవినీతి నిరోధక శాఖ తాజా కేసు నమోదుచేసింది. ఆయన ఆదాయానికి మించి రూ. 203 కోట్ల ఆస్తులు ఉన్నట్లు లెక్కతేలడంతో భుజ్‌బల్, ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసులు పెట్టారు. భుజ్‌బల్, ఆయన భార్య మీనా, కొడుకు పంకజ్, కోడలు విశాఖ, మేనల్లుడు సమీర్ తదితరులను నిందితులుగా పేర్కొన్నారు. వీళ్లతోపాటు సీఏలు సునీల్ నాయక్, చంద్రశేఖర్ శారద, హవాలా ఆపరేటర్ సురేష్ జజోడియా, భుజ్‌బల్ కంపెనీల డైరెక్టర్లు ప్రవీణ్‌కుమార్ జైన్, జగదీష్‌ప్రసాద్ పురోహిత్, ఆర్థిక సలహాదారు సంజీవ్ జైన్, స్నేహల్ సహకార సంఘం డైరెక్టర్ కపిల్ పూరీల పేర్లు కూడా ఎఫ్ఐఆర్‌లో ఉన్నాయి.
చీటింగ్, ఫోర్జరీ, అవినీతి కేసులు భుజ్‌బల్‌పై నమోదయ్యాయి. సెంట్రల్ లైబ్రరీ భూమి స్కాం, మహారాష్ట్ర సదన్ స్కాంలతో పాటు అక్రమంగా సంపాదించిన సొమ్ము కూడా ఆయన దగ్గర చాలా ఉందని ఏసీబీ తన కేసులో పేర్కొంది. ముంబై, పుణె, లోనావాలా, నాసిక్ ప్రాంతాల్లో ఉన్న ఛగన్ భుజ్‌బల్ ఇళ్లు, కార్యాలయాలు, ఇతర ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. బోగస్ కంపెనీలు ఏర్పాటుచేసి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు భుజ్‌బల్‌తో పాటు పంకజ్, సమీర్, నాయక్‌లపై వచ్చాయి.