చేతులు కలిపిన యాసిడ్ దాడి బాధితులు | Acid attack victims open cafe near Taj Mahal | Sakshi
Sakshi News home page

చేతులు కలిపిన యాసిడ్ దాడి బాధితులు

Published Thu, Oct 16 2014 4:45 AM | Last Updated on Fri, Aug 17 2018 2:10 PM

చేతులు కలిపిన యాసిడ్ దాడి బాధితులు - Sakshi

చేతులు కలిపిన యాసిడ్ దాడి బాధితులు

న్యూఢిల్లీ: తొలుత ఫొటో షూట్... తర్వాత డాక్యుమెంటరీ నిర్మాణం...  ఇదంతా ఏమిటనుకుంటున్నారా? ఓ స్వచ్ఛంద సంస్థ అండదండగా నిలిచిన కారణంగా యాసిడ్ దాడి బాధితుల జీవితంలో కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి. వారు తమ సొంతకాళ్లపై మనుగడ సాగించడం మొదలైంది. తాజాగా వీరంతా కలిసి తాజ్‌మహల్ వద్ద కేఫ్ షీరోస్ హ్యాంగౌట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. వీరికి చాన్వి అనే స్వచ్ఛంద సంస్థ అండగా నిలిచింది. యాసిడ్ దాడి జరగకముందు వీరంతా తమ జీవితంపై ఎన్నో కలలుగన్నారు. అయితే దాడి త ర్వాత వారి జీవితంలో చీకట్లు అల్లుకున్నాయి. ఈ నేపథ్యంలోనే చాన్వి వీరందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చింది. ఈ విషయమై చాన్వి సంస్థ సభ్యుడు ఆశిష్ శుక్లా బుధవారం మీడియాతో మాట్లాడుతూ ‘వారు స్వతంత్రంగా జీవించేలా చేయాలనేదే మా లక్ష్యం. ఇందులోభాగంగా వారికి ఓ అవకాశం కల్పించాం’అని అన్నారు. ఈ సంస్థ ఆగ్రాలోని తాజ్‌మహల్ సమీపంలోని ఫతేబాద్‌రోడ్డులో ఉంది. ఈ కేఫ్ ఏర్పాటుకు దాదాపు నెలరోజుల సమయం పట్టింది. ఇందుకు రూ. మూడు లక్షల వ్యయమైంది.
 
 నీతూ అనే యాసిడ్ దాడి బాధితురాలి స్మారకార్థం ఏర్పాటుచేసిన వెబ్‌సైట్ ద్వారా ఈ మొత్తాన్ని వీరంతా సేకరించారు. నీతూపై యాసిడ్ దాడి జరిగిన కొన్నాళ్ల తర్వాత ఆమె తండ్రి మరణించాడు. ఈ కారణంగా తల్లిపై కుటుంబభారం పడింది.  దీంతో నీతూ తల్లి పెట్టెలను విక్రయించడంద్వారా వచ్చే ఆదాయంతో కాలం గడుపుతోంది. కేఫ్ ప్రారంభించిన నేపథ్యంలో నీతూ వంటి యాసిడ్ దాడి బాధితులకు తమ సొంత కాళ్లపై జీవితం సాగించేందుకు ఓ అవకాశం లభించినట్టయింది. ‘విరాళాల వ్యవస్థకు తెరదించాలనుకుంటున్నాం. స్వతంత్రంగా జీవించేందుకుగాను బొటిక్‌లు, కేఫ్‌లను ప్రారంభించాలని నిర్ణయించాం. ఇది బాధిత కుటుంబాలకు ఓ పునరావాసం వంటిది’ అని ఆశిష్ శుక్లా చెప్పారు. కాగా ఈ కేఫ్‌లోని గోడలపై వివిధ రకాల పెయింటింగ్‌లను ఉంచారు. ఇందులో మహిళా సాధికారతకు సంబంధించిన ఫొటోలు కూడా ఉన్నాయి.
 
 ఇంకా రూప అనే  21 ఏళ్ల యాసిడ్ దాడి బాధితురాలు ఈ కేఫ్‌లో తాను రూపొందించి దుస్తులను అందుబాటులో ఉంచింది. ఇదిలాఉంచితే యాసిడ్ దాడి బాధితురాళ్లయిన చంచల్, రీతు, సోనమ్‌లు రూప రూపొందించిన దుస్తులు ధరించి ఈ ఏడాది ఆరంభంలో ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. వీరి జీవితాలపై రాహుల్ శర్మ అనే వీడియోగ్రాఫర్ ప్రస్తుతం డాక్యుమెంటరీని నిర్మిస్తున్నాడు. ఈ కేఫ్‌లో ఏర్పాటుచేసిన టీవీలో మహిళా సాధికారతకు సంబంధించి డాక్యుమెంటరీలు, సినిమాలను ప్రదర్శిస్తున్నారు. దీంతోపాటు హస్తకళాకృతులను కూడా ఈ కేఫ్‌లో ఉంచారు. కాగా ఈ కేఫ్ పురోగతిపై చాన్వి సంస్థ నెలకోసారి సమీక్షా సమావేశం నిర్వహించనుంది. ఈ విషయమై ఆశిష్ మాట్లాడుతూ ‘నెలకోసారి సమీక్షిస్తాం. ఇది యాసిడ్ దాడి బాధితులకు ఎంతమేర ఉపయోగపడుతుందనే విషయాన్ని చర్చిస్తాం’అని అన్నారు.  17న ప్రారంభం యాసిడ్ దాడి బాధితుల జీవనోపాధి కోసం ఏర్పాటుచేసిన ఈ కేఫ్ ఈ నెల 17వ తేదీన ప్రారంభం కానుంది. ఈ కేఫ్‌కు విస్త్రత ప్రచారం కల్పించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఇందులోభాగంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇటువంటి కేఫ్‌లను త్వరలో ఢిల్లీ, కాన్పూర్, లూథియానా నగరాల్లో త్వరలో ఏర్పాటు చేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement