
సమస్యలున్న మాట వాస్తవమే...
జమ్మూకశ్మీర్ పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుపై వస్తున్న విమర్శలపై ఎట్టకేలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనం వీడారు.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో వస్తున్న విమర్శలపై ఎట్టకేలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనం వీడారు. కొన్ని సమస్యలున్న మాట వాస్తవమేనని తొలిసారిగా అంగీకరించారు. కానీ అవన్నీ టీతింగ్ ప్రోబ్లమ్స్ అనీ , కొద్దిగా ఓపిక పడితే అన్ని సమస్యలు పరిష్కారమవు తాయన్నారు. అయితే ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని...జాతికి విఘాతం కలిగించే శక్తులను, టెర్రరిస్టులను ఉపేక్షించేదిలేదని ఆయన తేల్చి చెప్పారు. సుపరిపాలన, ప్రజాభాగస్వామ్యంతో అన్ని సమస్యలను అధిగమించే సత్తా తమ ప్రభుత్వానికి ఉందన్నారు. వేర్పాటువాద నేత మస్రత్ అలీ విడుదలపై కేంద్రంతో సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.
మోదీ హవా తగ్గుతోందన్న వాదనలను కొట్టి ప్రధాని కొట్టి పారేశారు. ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం పై అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ ఢిల్లీ ప్రజల తీర్పును గౌరవిస్తామన్నారు. అదే సందర్భంలో దేశప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని, గౌరవాన్ని కాపాడుకుంటా మన్నారు. బీజేపీ మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ మధ్యకాలంలో తరచుగా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
రాజ్యసభలో ఎదురౌతున్న ప్రతిబంధకాలపై ప్రధాని మాట్లాడుతూ అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని, మిత్రపక్షాలు, ప్రతిపక్షాలకు స్వయంగా తానే విజ్ఞప్తి చేశానని పేర్కొన్నారు. పార్టీలన్నీ ఇందుకు సహకరిస్తాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.