యూజీసీ, డీయూల మధ్య వివాదంతో అడ్మిషన్లు ఎప్పుడు మొదలవుతాయో తెలియని అయోమయంలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఉండగా, తమ కోర్సు భవితవ్యం ఏమవుతుందనే
అయోమయం
Published Tue, Jun 24 2014 11:09 PM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM
సాక్షి, న్యూఢిల్లీ:యూజీసీ, డీయూల మధ్య వివాదంతో అడ్మిషన్లు ఎప్పుడు మొదలవుతాయో తెలియని అయోమయంలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఉండగా, తమ కోర్సు భవితవ్యం ఏమవుతుందనే ఆందోళన నాలుగేళ్ల గ్రాడ్యుయేషన్ కోర్సులో మొదటి సంవత్సరం చదివిన విద్యార్థులను వేధిస్తోంది. నాలుగేళ్ల కోర్సు రద్దుపై యూజీసీ ఏర్పాటుచేసిన 10 మంది సభ్యుల కమిటీ బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సులను మూడేళ్ల కోర్సులుగా మార్చి బీటెక్, బీఎంఎస్ కోర్సులను నాలుగేళ్ల కోర్సులుగా కొనసాగించాలంటూ సలహా ఇచ్చినట్లు తెలిసింది. కళాశాలల నుంచి నేరుగా అడ్మిషన్ తీసుకునే విషయాన్ని కూడా కమిటీ ప్రతిపాదించినట్లు తెలిసింది.
కొత్తగా అడ్మిషన్ తీసుకునే విద్యార్థులకు మూడేళ్ల డిగ్రీ ఇవ్వాలని, నాలుగేళ్ల కోర్సులో చేరిన పాత బ్యాచ్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ కోర్సును మూడేళ్లకు కుదించి మూడేళ్ల డిగ్రీ ఇవ్వాలని యూజీసీ నియమించిన కమిటీ సూచించినట్లు తెలిపింది. బీటెక్ కోర్సును నాలుగేళ్లు ఉంచాలని, మూడేళ్లలో బీటెక్ కోర్సు పూర్తి చేయాలనుకునే విద్యార్థులకు బీఎస్సీ ఆనర్స్ డిగ్రీ ఇవ్వాలని కమిటీ సూచించినట్లు తెలిసింది. 2013-14 విద్యా సంవత్సరంలో డీయూలో నాలుగు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంను ప్రవేశపెట్టారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ ఉపాధ్యాయుల సంఘం (డ్యూటా) దీనిని ఆదిలోనే వ్యతిరేకించింది. ఏబీవీపీ, ఐసా, ఎన్‌ఎస్‌యూఐ తదితర విద్యార్థి సంఘాలు కూడా దీనిని వ్యతిరేకించాయి. అయితే కొందరు టీచర్లు మాత్రం వీసీకి మద్దతు ప్రకటించారు. మొత్తమ్మీద నాలుగేళ్ల డిగ్రీ కోర్సుపై చెలరేగిన వివాదం విద్యార్థులను, ఉపాధ్యాయులను రెండుగా చీల్చింది.
నాలుగేళ్ల కోర్సును వ్యతిరేకిస్తున్న డ్యూటా సభ్యులతోపాటు విద్యార్థులు నియంతలా వ్యవహరించిన వీసీ రాజీనామా పట్ల హర్షం ప్రకటించారు. విద్యార్థులు మిఠాయిలు పంచిపెట్టుకుంటూ, సంబరాలు చేసుకున్నారు. దినేశ్‌సింగ్ రాజీనామా చేసినంత మాత్రాన సరిపోదని, విద్యార్థులను, ఉపాధ్యాయులను వేధించిన ఆయనపై దర్యాప్తు జరిపి చర్య తీసుకోవాలని డ్యూటా అధ్యక్షురాలు నందితా నారాయణ్ డిమాండ్ చేశారు. నాలుగేళ్ల డిగ్రీని కొనసాగించాలని కోరుతున్న ఉపాధ్యాయులు వైస్‌చాన్సలర్ రాజీనామాను సమర్థించారు. యూజీసీ ఒత్తిడికి లొంగకుండా విశ్వవిద్యాలయం స్వయంప్రతిపత్తిని కాపాడడం కోసం వీసీ రాజీనామాను ప్రకటించారని డ్యూటా మాజీ అధ్యక్షుడు ఏఎన్ మిశ్రా పేర్కొన్నారు. యూజీసీ, డీయూల మధ్య కొనసాగుతున్న వివాదంలో జోక్యం చేసుకోవాలని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సలహా ఇచ్చింది. మిశ్రాతో పాటు 200మంది ఉపాధ్యాయులు నాలుగేళ్ల కోర్సును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఒకరోజు నిరాహార దీక్ష జరిపారు. యూజీసీ... ఢిల్లీ విశ్వవిద్యాలయ స్వయంప్రతిపత్తిని కబళిస్తోందని వారు ఆరోపించారు. సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించడంతో ఈ వ్యవహారాన్ని తన వ్యక్తిగత ప్రతిష్టకు సవాలుగా తీసుకున్న దినేశ్ తన రాజీనామా ప్రకటించారు.
‘వీసీ రాజీనామా తెలివైన నిర్ణయం’
ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) వైస్‌చాన్సలర్ రాజీనామాపై బీజేపీ నాయకుడు ప్రభాత్‌ఝా హర్షం వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన ఇక్కడ ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. ‘రాజీనామా చేయడం ద్వారా వీసీ తెలివిగా వ్యవహరించారు. అయితే ఆయన డీ యూని మంటల్లోకి నెట్టేశారు. ఆ తర్వాతే తన పదవి నుంచి తప్పుకున్నారు. వందలాదిమంది విద్యార్థుల జీవితాలతో ఆయన చెలగాటమాడారు. దానిని ఖండిస్తున్నాం’ అని అన్నారు. మూడేళ్ల కోర్సుకే తాము మద్దతు పలుకుతామన్నారు. ఈ నెల 15వ తేదీనుంచి తమ పార్టీ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభమవుతుందని, 30వ తేదీదాకా కొనసాగుతుందని ఆయన తెలి పారు.
Advertisement
Advertisement