కళ్లనీళ్లు పెట్టుకున్న అద్వానీ
న్యూఢిల్లీ: లలిత్మోదీ వ్యవహారంపై లోక్సభలో కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ సమాధానం ఇచ్చిన తీరుకు బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ ముగ్ధుడైపోయారట. దాదాపు అరగంట సేపు అనర్గళంగా ఆమె చేసిన ప్రసంగానికి ఆయన ఒక దశలో కన్నీరు పెట్టుకున్నారు. ఆమెను శభాష్ అంటూ అభినందించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటినుంచి కాంగ్రెస్ సహా, ఇతర విపక్షాలు చేసిన దాడిని సుష్మా తిప్పికొట్టిన తీరు బీజేపీ అగ్రనేతను ఆకట్టుకుంది. ప్రతిపక్షాల నిరసనల మధ్య ఎక్కడా చలించకుండా తన వాగ్ధాటితో సభ్యులను కట్టడి చేసేందుకు సుష్మా శతవిధాలా ప్రయత్నించారు. సభలో ఆమె ప్రసంగం కొనసాగుతున్నపుడు అద్వానీ పక్కనే ఆశీనులయ్యారు.
సీనియర్ పార్లమెంటు సభ్యుడుగా లోక్సభలో ఎన్నో వివాదాలకు, వేడివాడి చర్చలకు, చారిత్రక నిర్ణయాలకు సాక్ష్యంగా నిలిచిన ఆయన.. సుష్మ వాదించిన తీరుకు చలించిపోయారు. తన వాదన ద్వారా పార్టీని, తనను తాను సమర్ధించుకున్న మహిళా ఎంపీని అభినందించారు.
కాగా బుధవారం లలిత్ గేట్ వివాదంతో లోక్సభలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మాటల యుద్ధం నడించింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభను హోరెత్తించారు. అరుపులు కేకలతో సభ దద్దరిలిపోయింది.