సైకిల్–1లో 8.67 ఎంటీవోఈ ఇంధనం ఆదా
సైకిల్–2లో ఆదా అయిన ఇంధనం 14.08 ఎంటీవోఈ
పెర్ఫార్మ్, అచీవ్ ట్రేడ్ పథకంపై రీజనల్ వర్క్‌షాప్
ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల పరిశ్రమల ప్రతినిధులు హాజరు
సాక్షి, అమరావతి: పెర్ఫార్మ్, అచీవ్ ట్రేడ్ (పాట్) పథకం అమలులో రాష్ట్రం ఉత్తమ ఫలితాలు సాధిస్తోందని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చెప్పారు. పారిశ్రామికరంగంలో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇంధన వ్యయాన్ని తగ్గించడం, గ్రీన్‌హౌస్ ఉద్గారాలను కట్టడిచేయడం వంటి లక్ష్యాలను సాధించడంలో భాగంగా పరిశ్రమల్లో ఎనర్జీ మేనేజర్లకు పాట్ పథకంపై బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్‌ఈసీఎం) బుధవారం విజయవాడలో రీజనల్ వర్క్‌షాప్ నిర్వహించింది.
ఈ వర్క్‌షాప్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయానంద్ ఏపీఎస్‌ఈసీఎం సీఈవో కుమారరెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు, నెడ్‌క్యాప్ వీసీ, ఎండీ నందకిషోర్‌రెడ్డి, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ సీఎండీ కమలాకర్‌బాబు, బీఈఈ సీనియర్ సెక్టార్ ఎక్స్‌పర్ట్ నవీన్‌కుమార్‌లతో కలిసి పాట్‌పై బుక్‌లెట్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిశ్రమల్లో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు పాట్ పథకం అమలు చేయటం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం, ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లలో డీకార్బనైజేషన్ చర్యలు నిర్వహించడం వంటి పటిష్టమైన ప్లాన్‌ను రూపొందించిన ఉత్తమ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని చెప్పారు.
ఈ పథకం దేశవ్యాప్తంగా అద్భుతమైన ఫలితాలను సాధించిందన్నారు. పాట్ సైకిల్–1లో 8.67 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వివాలెంట్ (ఎంటీవోఈ) ఇంధనాన్ని ఆదా చేయడం వల్ల సుమారు 31 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను నివారించగలిగామని చెప్పారు. పాట్ సైకిల్–2లో 14.08 ఎంటీవోఈ ఇంధనం ఆదా చేయడంద్వారా 68 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించామని తెలిపారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో పరిశ్రమలు ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయడం ద్వారా పాట్ సైకిల్–3 వరకు 1.16 ఎంటీవోఈ ఇంధనాన్ని ఆదా చేశాయని చెప్పారు.
పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే కాకుండా పారిశ్రామిక ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని ఆయన తెలిపారు. వర్క్‌షాప్‌లో ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సిమెంట్, టెక్స్‌టైల్స్, పవర్‌ప్లాంట్లు, ఎరువులు, ఇనుము, ఉక్కు, ఎరువులు, సిమెంట్, అల్యూమినియం, పేపర్, క్లోర్–ఆల్కల్ పరిశ్రమల నుంచి 100 మందికిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment