డేరా చీఫ్‌గా గుర్మీత్ కుమారుడు
డేరా చీఫ్‌గా గుర్మీత్ కుమారుడు
Published Sun, Sep 17 2017 3:03 PM | Last Updated on Tue, Sep 19 2017 4:41 PM
సాక్షి,సిర్సాః డేరా తదుపరి చీఫ్‌గా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కుమారుడు జస్మీత్ పగ్గాలు చేపట్టనున్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఆందోళనతో డేరా మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్‌పర్సన్ విపాసన అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో కుమాడికే డేరా బాధ్యతలు అప్పగించేందుకు గుర్మీత్ అంగీకరించారు. గుర్మీత్, హనీప్రీత్ తర్వాత డేరా సచా సౌథాలో మూడవ అత్యంత ప్రభావంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2002లో ఇద్దరు సాధ్విలపై అత్యాచారానికి ఒడిగట్టిన కేసులో గుర్మీత్ సింగ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం విదితమే. గుర్మీత్‌ను జైలుకు తరలించినప్పటి నుంచి హనీప్రీత్ ఆచూకీ గల్లంతైంది. గుర్మీత్ పారిపోయేందుకు హనీప్రీత్ పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. గుర్మీత్ మరో సన్నిహిత సహచరుడు ఆదిత్య ఇన్సాన్ సైతం అదృశ్యమయ్యారు.
మరోవైపు విపాసన శుక్రవారం నుంచి డేరాలో కనిపించడం లేదు. రాజస్ధాన్‌లోని గంగానగర్ జిల్లా గుర్సార్‌మోదియాకు వెళ్లారని డేరా వర్గాలు తెలిపాయి. తనను పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఆందోళనతో ఆమె డేరా చీఫ్ స్వస్థలమైన గంగానగర్ జిల్లాకు వెళ్లారని, ఆయన కుమారుడు జస్మీత్‌కు కొన్ని కీలక పత్రాలు అందించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.అయితే ఆమె ఫోన్ స్విఛాఫ్ కావడం, తిరిగి డేరాకు చేరుకోకపోవడంతో ఆమె అరెస్ట్ భయంతో పారిపోయారని భావిస్తున్నారు.
Advertisement