డేరా హత్య కేసులు.. తుది వాదనలు
డేరా హత్య కేసులు.. తుది వాదనలు
Published Sat, Sep 16 2017 12:36 PM | Last Updated on Mon, Jul 30 2018 8:51 PM
సాక్షి, సిర్సా: జంట హత్యల కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ భవితవ్యంపై నిర్ణయాన్ని పంచకుల సీబీఐ న్యాయస్థానం వాయిదా వేసింది. కీలక సాక్షిగా భావిస్తున్న గుర్మీత్ మాజీ డ్రైవర్ కట్టా సింగ్ స్టేట్‌మెంట్‌ను పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అన్న పిటిషన్‌పై సెప్టెంబర్ 22 తేదీన తేలుస్తామని న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ వెల్లడించారు. ఇదే విషయాన్ని కట్టా సింగ్ తరపు న్యాయవాది ధృవీకరించారు కూడా.
తన చీకటి వ్యవహారాలను వెలుగులోకి తెచ్చారనే జర్నలిస్ట్ రామ్ చంద్ర ఛత్రపది, డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్‌లను హత్య చేయించారన్న ఆరోపణలు గుర్మీత్‌పై ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసు నమోదుకాగా, నేడు ప్రత్యేక కోర్టులో తుది వాదనలు జరిగాయి. ఇక కేసులో ఆరుగురు నిందితులు కోర్టుకు నేరుగా హాజరుకాగా, అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తూ జైలులో ఉన్న గుర్మీత్ సింగ్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. అనువాదకుడిని నియమించాలా? అని జడ్జి కోరగా... అందుకు గుర్మీత్ అక్కర్లేదని చెప్పినట్లు తెలుస్తోంది.
రామ్ రహీమ్ నుంచి హని ఉందనే భయంతో గతంలో తప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చానని, అనుమతి ఇస్తే ఇప్పుడు అసలు విషయాలను చెబుతానంటూ మాజీ డ్రైవర్ కట్టా సింగ్ చెబుతున్నాడు. స్వయంగా కోర్టుకు హాజరయ్యేందుకు కూడా తాను సిద్ధమని చెప్పాడు. అంతేకాదు డేరా బాబా దత్త పుత్రికగా చెబుతున్న హనీప్రీత్ సింగ్ పుణే, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్ లో దాక్కుని ఉండొచ్చన్న అనుమానాలు అతను వ్యక్తం చేస్తున్నాడు. ఒకవేళ సిర్సాలోనే ఆమె తలదాచుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కట్టా సింగ్ అంటున్నాడు.
ఇక గుర్మీత్ విచారణ నేపథ్యంలో గతంలో మాదిరి అల్లర్లు చోటు చేసుకోకుండా పంచకులలో 5 బెటాలియన్లతో భద్రతా ఏర్పాట్లను చేశారు. 2002 లో డేరా సభ్యుడు రజింత్ సింగ్‌ను, సిర్సా జర్నలిస్ట్‌లను అనుచరులతో చంపించాడన్న ఆరోపణలు గుర్మీత్‌పై ఉన్నాయి. ఈ కేసులో ప్రత్యేక న్యాయ స్థానం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Advertisement
Advertisement