న్యూఢిల్లీ: కాలేజీలు, యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామకానికి సంబంధించిన జాతీయ అర్హత పరీక్ష (నెట్)ను ఇకపై ఏడాదికోసారే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి సీబీఎస్‌ఈ ప్రతిపాదించింది. ‘ఏడాదికోసారి నెట్ నిర్వహించటం ద్వారా అభ్యర్థులు మరింత పకడ్బందీగా పరీక్షకు సిద్ధమయ్యేలా చేయవచ్చు. సరైన విధంగా నిధులు, మౌలికవసతుల వినియోగం జరుగుతుంది.
ప్రతి ఏటా రిజిస్టర్ చేసుకున్న వారిలో 17 శాతమే పరీక్షలకు హాజరవుతుండగా.. అందులో నాలుగు శాతం మాత్రమే అర్హత సాధిస్తున్నారు’ అని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా, జూలైలో నిర్వహించాల్సిన నెట్ పరీక్షకోసం ఇంతవరకు నోటిఫికేషన్ విడుదల కాకపోవటంపై అనిశ్చితిని కేంద్రం తొలగించింది. ఇకపై నెట్ పరీక్షను సీబీఎస్‌ఈ నిర్వహిస్తుందని యూజీసీ స్పష్టం చేసింది. నెట్ నోటిఫికేషన్ గురించి విద్యార్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని యూజీసీ ఈ నిర్ణయం తీసుకుంది.