
యోగి కేబినెట్ రెండో నిర్ణయం ఇదే
లక్నో: తమ రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు 2020నాటికి పూర్తిస్థాయిలో విద్యుత్ సౌకర్యం ఏర్పాటుచేస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ పథకాన్ని 'అందరికీ విద్యుత్' అని పేర్కొంది. దీనికి సంబంధించి అవగాహన ఒప్పందంపై మంగళవారం సంతకం చేసింది. అధికారం చేపట్టిన తర్వాత గత వారం తొలి కేబినెట్ సమావేశంలో రైతుల రుణమాఫీపై నిర్ణయం తీసుకున్న యోగి ఆధిత్యనాథ్ మంగళవారం నాటి రెండో కేబినెట్ సమావేశంలో విద్యుత్ సమస్యపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ఇప్పటికే విద్యుత్ సౌకర్యం అందుబాటులో ఉన్న గ్రామాలకు రోజుకు 18గంటలు, మండలాలకు, బుందేల్‌ఖండ్ ప్రాంతాలకు 20గంటలు నిర్విరామ విద్యుత్‌ను అందిస్తామని కేబినెట్ సమావేశం అనంతరం శ్రీకాంత్ శర్మ, సిద్దార్థ్‌నాథ్ సింగ్ మీడియాకు తెలియజేశారు. అలాగే, జిల్లాలకు 24గంటలపాటు విద్యుత్ అందిస్తామని చెప్పారు. 2018నాటికి రాష్ట్రం అంతటా కూడా 24గంటల విద్యుత్‌ను అందించడమే తమ లక్ష్యం అని తెలిపారు.
ప్రస్తుతం పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా విద్యుత్ సమస్య ఏర్పడకుండా చూడాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారని తెలిపారు. ప్రతి ఇంట్లో, ప్రతి పేదవారి కుటుంబంలో, ప్రతి గ్రామంలో 2018నాటికి పూర్తిస్థాయి విద్యుత్ అందాలనేది బీజేపీ చీఫ్ అమిత్‌షా, సీఎం యోగి డ్రీమ్ అని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటుచేయాలని యోగి ఆదేశించినట్లు వివరించారు.