త్రివేండ్రం: సెన్సార్ బోర్డుపై మరో సినీ పరిశ్రమ యుద్ధం ప్రకటించింది. కథకళి సినిమాకు యూ సర్టిఫికెట్ ను నిరాకరించినందుకు... మాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఆగ్రహం వ్యక్తం చేసింది. మలయాళ దర్శకులు, నిర్మాతలు సోమవారం త్రివేండ్రంలోని సీబీఎఫ్‑సీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయిన యువ దర్శకుడు సజ్జు కన్నానైక్కల్ కథకళి చిత్రానికి దర్శకత్వం వహించారు. చిత్రానికి ప్రాణంలాంటి సన్నివేశాలను బోర్డు అధికారులు కత్తిరించేశారని దర్శకుడు ఆవేదన వ్యక్తం చేశారు.
సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చిత్ర యూనిట్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, నిబంధనలకు అనుగుణంగానే కథకళి సినిమాను సర్టిఫై చేశామని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. కథకళి నిర్మాతల పిటిషన్ స్వీకరించిన హైకోర్టు సీబీఎఫ్ సీ, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా, సినిమా క్లైమాక్స్ లో కథకళి వేషాన్ని వదిలిపెట్టి వ్యక్తి న్యూడ్ గా పరుగెత్తే సీన్ ను తొలగించాలంటూ సీబీఎఫ్ సీ మేకర్స్ కు సూచించింది. దీనిపై స్పందించిన డెరెక్టర్ ఆ సీన్ సినిమాకు సింబాలిక్ రిప్రజెంటేషన్ అని దానిని తీయలేమని వాదిస్తున్నారు.
దేశ వ్యతిరేకంగా కానీ, సెక్సువల్ గా కానీ, మహిళలను వేధించడం లాంటి సీన్ లు ఏమి సినిమాలో లేవని.. కేవలం చివరిలో ఒక వ్యక్తి న్యూడ్ గా నడుచుకుంటూ వెళ్తాడని, అది కూడా లాంగ్ షాట్ లో తీశామని సజ్జు తెలిపారు. కానీ, సీబీఎఫ్ సీ బోర్డు చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ ఇవ్వడం సమజసం కాదని అన్నారు. కాగా, క్లైమాక్స్, రెండో రీల్ లో బాస్టర్డ్ అనే పదం అక్కడే ఓ వ్యక్తి వస్త్రాలు తీసేసి చితక్కొట్టే సీన్ లను తొలగించాలని బోర్డు తెలిపింది. 83 కట్‌లు విధించినందుకు ఉడ్తా పంజాబ్ నిర్మాతలు బెంబే హైకోర్టులో న్యాయ పోరాటం చేసిన విషయం తెలిసిందే.