
క్లాస్ రూమ్‌లో కొడుకుతో కలిసి రజనీ బాల
పంజాబ్: అయినా ఇదేమి చోద్యమమ్మా.. పిల్లల్ని చదివించాల్సిన ఈ లేటు వయసులో ఈ చదువులేమిటో అని నలుగురూ నానా రకాలుగా అవహేళన చేసినా ఆ మహిళ పట్టించుకోలేదు. చదువుకోవాలనే దృఢ సంకల్పంతో పదో తరగతి చదువుతున్న కొడుకుతో కలిసి ఆమె కూడా స్కూలుకు వెళ్లి పాఠాలు నేర్చుకుంటోంది. పంజాబ్‌లోని లుధియానా వాసి అయిన 44 ఏళ్ల రజనీ బాల సంగతి ఇది. ముగ్గురు పిల్లల తల్లి అయిన రజనీ బాల...చదువు మీద మక్కువతో 29 ఏళ్ల తర్వాత మళ్లీ పుస్తకాలు చేతపట్టింది. తల్లీకొడుకులు పదో తరగతి చదువుతున్నారు.
‘నా భర్త చాలాసార్లు పదో తరగతి చదవమని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల చదవలేక పోయాను. కానీ ఇప్పుడు మా పిల్లలు కూడా చదువుకోమని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అటెండర్‌గా పనిచేస్తున్న నాకు కనీసం పదో తరగతి విద్యార్హత ఉంటే బాంగుండనిపించింది. దీంతో మా అబ్బాయితో కలిసి స్కూల్‌లో చేరాను. మా అత్తమ్మ, మా భర్త నాకు చాలా సహకరిస్తున్నారు. రోజు ఉదయాన్నే నన్ను, మా పిల్లల్ని నిద్రలేపి చదివిస్తారు. నా కూతుళ్లు కూడా సహాయం చేస్తారు. ఈ రోజుల్లో కనీసం పదో తరగతి అయినా చదివి ఉండాలి’ అని ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీ బాల తెలిపారు.
ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఆమె భర్త రాజ్ కుమార్ సతి కూడా 17 ఏళ్ల విరామం తర్వాత డిగ్రీ పట్టభద్రుడయ్యారు. రజనీ బాలను కూడా డిగ్రీ చదివిస్తానని రాజ్ కుమార్ చెబుతున్నారు. ఓవైపు తన కుటుంబాన్ని, పిల్లల్ని చూసుకుంటూ, మరో వైపు చదువుకోవాలనే పట్టుదలతో పాఠశాలకు వస్తున్న రజనీ బాలను ఆ పాఠశాల ఉపాధ్యాయులు మెచ్చుకుంటున్నారు. ఏదిఏమైనా చదువు నేర్చుకోవడాని వయస్సు అడ్డురాదని మరో సారి నిరూపించింది రజనీ బాల కుటుంబం.