ఒబామా వస్తారని.. రోడ్లు కడిగిస్తున్నారు!
మన దేశంలో ప్రజల కోసం రోడ్ల మీద గుంతలు పూడ్చడానికి, అసలు రోడ్లే లేని చోట రోడ్లు వేయడానికి కూడా తీరికలేని అధికారులు.. అమెరికా అధ్యక్షుడు ఒబామా వస్తున్నారంటే మాత్రం ఎక్కడలేని శ్రద్ధ కనబరుస్తున్నారు. కార్మికులను వందల సంఖ్యలో నియమించి.. రోడ్లన్నింటినీ అద్దాల్లా మారుస్తున్నారు. ఈ కార్మికులు స్వయంగా రోడ్లను బ్రష్లు పెట్టి తమ సొంత చేతులతో శుభ్రం చేస్తున్నారు. మోకాళ్ల మీద నిలబడి.. నడుం వంచి ఒక రోజంతా ఇలా రోడ్లను సర్ఫుతో కడిగినందుకు అతడికి లభించే కూలీ.. కేవలం రూ. 300. ఆగ్రా నగరం మొత్తాన్ని ఇలా శుభ్రం చేయించడానికి మొత్తం 600 మందిని నియమించారు. ఒబామా దంపతులు తాజ్ సందర్శనకు వస్తున్న నేపథ్యంలో ఈ నగరంలో ఎక్కడా చిన్న కాగితం ముక్కగానీ, దుమ్ము గానీ ఉండకూడదని జాగ్రత్త పడుతున్నారు. వీధికుక్కలు, ఆవులు, గేదెలు నగరంలో తిరగడానికి వీల్లేదని వాటిని కట్టిపారేశారు. చిన్న మరక కనపడినా అధికారులు ఊరుకోరని.. అందుకే తాము అత్యంత జాగ్రత్తగా అంగుళం అంగుళం శుభ్రం చేస్తున్నామని కార్మికుల్లో ఒకరు తెలిపారు.
ఇక యమునా నదిలోంచి కూడా కేవలం రెండు రోజుల్లో రెండు టన్నుల చెత్తను తీసేశారు. తాజ్మహల్ యమునా తీరంలోనే ఉండటంతో ఆ నది కూడా అందంగా కనపడాలిన అధికారులు ప్రయత్నిస్తున్నారు. తాజ్మహల్ లోపల భాగాలను, లాన్లను కూడా మహిళలను పెట్టి శుభ్రం చేయిస్తున్నారు. ఒబామా వచ్చేరోజు పర్యాటకులు ఎవరినీ అనుమతించడం లేదు. ఇక తాజ్ చుట్టుపక్కల, ఆ కట్టడానికి వెళ్లే మార్గంలో ఉన్న ఇళ్ల వారిమీద కూడా నిషేధాజ్ఞలు ఉన్నాయి. బయటకు వెళ్లకూడదు, డాబా మీదకు వెళ్లకూడదు, కనీసం బయటకు బాత్రూంకైనా కూడా వెళ్లకూడదు.. పుట్టినప్పటి నుంచి ఇలాంటి నిబంధనలు ఎప్పుడూ చూడలేదని అనిల్ శంకర్ వాపోయారు.