
గాంధీనగర్ : గుజరాత్ ముఖ్య పట్టణం అహ్మదాబాద్ పేరును మార్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ పేర్కొన్నారు. చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తని నేపథ్యంలో అహ్మబాద్ పేరును కర్ణావతిగా మారుస్తామని ఆయన పేర్కొన్నారు. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన నితిన్ పటేల్ మాట్లాడుతూ...‘ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారు కోరుకుంటే అహ్మదాబాద్ ఇకపై కర్ణావతిగా పిలువబడుతుంది. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో నితిన్ పటేల్ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ దోషి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మెజార్టీ ఓటర్లను ఆకర్షించి ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్డీయే ప్రభుత్వం దిగజారుడుతనానికి పాల్పడుతోందంటూ విమర్శించారు. ప్రస్తుతం అహ్మదాబాద్ పేరు మార్చాల్సిన అవసరం ఏం వచ్చిందంటూ ఆయన ప్రశ్నించారు.
కాగా ఇటీవలే ఉత్తరప్రదేశ్ ముఖ్య పట్టణం అలహాబాద్ పేరును ప్రయాగరాజ్‌గా, ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్యగా మారుస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అదే విధంగా హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లా పేరును శ్యామలగా మార్చే అవకాశం ఉందని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఈ క్రమంలో బీజేపీ అధినాయకత్వ వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కర్ణావతి ఎందుకు?
11 వ శతాబ్దంలో జరిగిన యుద్ధంలో అశవాల్(ప్రస్తుతం అహ్మదాబాద్‌గా పిలువబడుతున్న ప్రాంతం) రాజును ఓడించిన చాళుక్య రాజు కర్ణ సబర్మతీ తీరంలో కర్ణావతి అనే పట్టణాన్ని స్థాపించాడు. కాలక్రమంలో ఆ ప్రాంతాన్ని చేజిక్కించుకున్న సుల్తాన్ అహ్మద్ షా కర్ణావతిని ఆక్రమించుకుని అహ్మదాబాద్‌గా పేరు మార్చాడు. అయితే ముస్లిం రాజు పేరుతో ఉన్న పట్టణ పేరును మార్చడం ద్వారా హిందూ ఓటర్లను ఆకర్షించవచ్చనే దుర్బుద్ధితోనే బీజేపీ ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment