మానవత్వం మనిషి రూపులో..
ఆయనేమీ ధనవంతుడు కాదు.. 15 ఏళ్ల వయసులో పొట్టకూటి కోసం పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన కాందిశీకుడు.. జీవన పోరాటంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని చివరకు అహ్మదాబాద్ వీధుల్లో రిక్షాపై తిరుగుతూ ముత్యాల హారాలు అమ్మే వీధి వ్యాపారిగా స్థిరపడ్డాడు. అయితే నేం మూర్తీభవించిన మానవత్వానికి తాను ప్రతిరూపమని నిరూపించుకున్నాడు మిథాలాల్ సింధీ.
నా అనేవారు ఎవరూ లేని అనాథ శవాలకు అన్నీ తానై దహన సంస్కారాలు జరిపిస్తుంటాడు. ఇలా ఆరు దశాబ్దాల కాలంలో 550 అనాథ శవాలకు దహన సంస్కారాలు జరిపించాడు. ఫుట్ పాత్‌పై తన సహచరుడు మరణించినప్పుడు దహన సంస్కారాలకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రారంభమైన ఈ సేవ.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
‘అనాథ శవం ఉందని సమాచారం రాగానే అక్కడికి చేరుకొని ఆ వ్యక్తి శరీరంపై మతపరమైన ఆనవాళ్లేమైనా ఉన్నాయేమో పరిశీలిస్తాను. ఏ మతస్తుడో తెలిస్తే ఆ మతపరమైన విధానంలో అంత్యక్రియలు నిర్వహిస్తాను’ అని మిథాలాల్ చెబుతున్నాడు. ఒక్కో శవం అంత్యక్రియలకూ మిథాలాల్‌కు కనీసం రూ.15 వందలు ఖర్చవుతుంది. ముత్యాల హారాలు అమ్ముతూ సమకూర్చుకున్న మొత్తాన్నే అందుకు వినియోగిస్తుంటాడు. 83 ఏళ్ల మిథాలాల్ గత 60 ఏళ్లుగా ఫుట్ పాత్‌పైనే జీవిస్తున్నాడు.