సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సృష్టించిన సంక్షోభంతో ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలోని శాశ్వత ఉద్యోగులను వేతనం లేని సెలవు (ఎల్‌డబ్ల్యూపీ) పథకం కింద ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు సెలవుపై పంపించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఎయిరిండియా డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.
ప్రస్తుత సంక్షోభ సమయంలో ఖర్చులను తగ్గించే ప్రయత్నంలో ఈ నిర్ణయం తీసుక్నునట్టు తెలిపింది. దీన్ని ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉందని జూలై 14న జారీ చేసిన నోటీసులో సంస్థ తెలిపింది. ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల పాటు బోర్డు విచక్షణ ఆధారంగా ఇది ఉంటుందని ప్రకటించింది. జూలై 7న జరిగిన బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ 102వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ఆగస్టు 15 లోపు ఎల్‌డబ్ల్యూపీ ఉద్యోగుల జాబితాను అందించాలని సంబందిత అధికారులను అదేశించింది.
కాగా కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా రవాణా రంగం కుదేలైంది. కరోనా కట్టిడికి అమలు చేసిన లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రధానంగా విమానయాన సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోవడంతో ఆదాయం భారీగా పడిపోయింది. మహమ్మారి కారణంగా దేశీయంగా విమానయాన సంస్థలు 2020- 2022 మధ్యకాలంలో 1.3 ట్రిలియన్ల రూపాయల ఆదాయ నష్టాన్ని ఎదుర్కొంటున్నాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ బుధవారం ఒక నివేదికలో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment