కరోనా టైంలో పూర్తిగా మునిగిన మార్కెట్, వ్యాపారాలు.. కాస్తో కూస్తో కొంతకాలంగా కుదుట పడుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో పూర్తిగా కోలుకోవడానికి ఈ ఏడాది సహకరించవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. తద్వారా కరోనా ముందు కంటే ఉన్న జీతాల పెంపును ఉద్యోగులు ఆశిస్తుండగా.. 2022లో అది జరగవచ్చనే చెప్తున్నాయి సర్వేలు.
కోర్న్ ఫెర్రీ ఇండియా ఆనువల్ రివార్డ్స్ సర్వే ప్రకారం.. కరోనా టైం కంటే ముందున్న స్థితికి ఉద్యోగుల శాలరీ ఇంక్రిమెంట్ చేరవచ్చనే తేలింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు చిన్నాచితకా, బడా కంపెనీల(ఎంఎన్‌సీలతో సహా)లో నిర్వహించిన సర్వేల ద్వారా ఈ వివరాల్ని సేకరించారు. గతంలో.. 2019లో యావరేజ్ పే హైక్ భారత్‌లో 9.25 శాతం ఉండగా.. 2021 ఏడాదికి అది 8.4కి పడిపోయింది కొవిడ్-19 ఎఫెక్ట్‌తో. అయితే కంపెనీల ఫీడ్‌బ్యాక్ అనంతరం 2022లో ఇది 9.4 శాతానికి చేరుకోవచ్చని ఈ సర్వే వెల్లడించింది.
2022 ఏడాదిలో వ్యాపారాలపై కరోనా ఎఫెక్ట్ అంతగా ఉండబోదని, పైగా కరోనాతో నష్టపోయిన పరిస్థితుల నుంచి ఈ ఏడాది కచ్చితంగా గట్టెక్కి తీరుతుందని వ్యాపార రంగం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ గాడినపడడానికి తోడ్పడడంతో పాటు 2020-21 ఆర్థిక సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను అందుకుంటుందన్న కొత్త ఉత్సాహాన్ని అందిస్తోంది. దాదాపు 40 శాతం ఉద్యోగులు తరలిపోతారనే నివేదికల నేపథ్యంలోనే పలు కంపెనీలు ఈ ఏడాది హైకుల విషయంలో కచ్చితత్వం పాటించాలని నిర్ణయించుకున్నాయట.
పారిశ్రామిక నిపుణుల ప్రకారం.. ఇంక్రిమెంట్ల కోసం కేటాయించే బడ్జెట్ సాధారణంగా వ్యాపార తీరు, పారిశ్రామిక గణాంకాలు, బెంచ్‌మార్క్ ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ ఏడాది సానుకూల ఫలితాల్ని ఆశిస్తున్నారట. ఈ క్రమంలోనే ఈ ఏడాది మంచి ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, నైపుణ్యంగల ఉద్యోగుల ఎంపిక దిశగా అన్ని రంగాలు ముందుకెళ్లవచ్చని చెప్తున్నారు.
అన్ని రంగాలు కోలుకోవడంతో పాటు గరిష్ఠంగా హైక్ శాతం.. టెక్ కంపెనీలు 10.5 శాతం ఇవ్వాలని అనుకుంటున్నాయని, లైఫ్ సైన్స్ 9.5 శాతం, సేవా, ఆటో, కెమికల్స్ రంగం 9.5 శాతం అంచనా వేస్తున్నట్లు సర్వేలు చెప్తున్నాయి. మిగతా రంగాల నుంచి 4 శాతానికి తక్కువ కాకుండా శాలరీ హైక్‌ల ఆలోచనలో ఉన్నట్లు పలు సర్వేలు చెప్తున్నాయి.
అదే సమయంలో 786 కంపెనీలకుగానూ 60 శాతం కంపెనీలు.. మంత్లీ వైఫై అలవెన్స్‌లు, యుటిలిటీ బిల్లులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. 46 శాతం కంపెనీలు ఉద్యోగుల వెల్‌నెస్ బెనిఫిట్లు అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఇక మరో 10 శాతం కంపెనీలు ట్రావెల్ అలవెన్స్‌ను తగ్గించడమో లేదంటే పూర్తిగా రద్దు చేయాలనే యోచనలో ఉన్నాయని సీఎన్‌బీసీ ఒక కథనం ప్రచురించింది.
Comments
Please login to add a commentAdd a comment