అఖిలేశ్ ‘రథయాత్ర’ షురూ
ప్రారంభించిన ములాయం.. హాజరైన శివపాల్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అగ్రనేతలు గురువారం కలహాలను పక్కనబెట్టి ఒకే వేదికను పంచుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి అఖిలేశ్ చేపట్టిన రథయాత్ర ప్రారంభ సభకు ఎస్పీ జాతీయాధ్యక్షుడు ములాయం, రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ హాజరయ్యారు. తమ కుటుంబం, పార్టీ ఐకమత్యంతోనే ఉందనే సంకేతాలను ప్రజల్లోకి పంపే యత్నం చేశారు. కొన్ని రోజులుగా అఖిలేశ్, శివపాల్‌ల మధ్య విభేదాలు ఉండటం..కొడుకు అఖిలేశ్‌ను కాదని తమ్ముడు శివపాల్‌కు ములాయం మద్దతు ఇస్తుండటం తెలిసిందే.
తాజాగా అఖిలేశ్, శివపాల్‌ల మధ్య ములాయం సంధి కుదిర్చినట్లు సమాచారం. లక్నోలో ములాయం యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. కీలకమైన 2017 ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా నిలువరించడమే తమ లక్ష్యమన్నారు. ఎన్నికల్లో పొత్తుల గురించి విలేకరులు అఖిలేశ్‌ను ప్రశ్నించినపుడు మాత్రం వారి మధ్య సమాచారలోపం బట్టబయలైంది. పొత్తులు ఎవరితో పెట్టుకుంటున్నారు? ప్రస్తుతం ఏం చర్చిస్తున్నారు? తదితర విషయాలేవీ తనకు తెలియవని అఖిలేశ్ చెప్పారు.
రేపటి నుంచి బీజేపీ యాత్ర
న్యూఢిల్లీ: బీజేపీ కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికల కసరత్తులో భాగంగా పరివర్తన యాత్రలు నిర్వహిస్తోంది. మొత్తం నాలుగు యాత్రలను నవంబరు 5-9 తేదీల మధ్య ప్రారంభిస్తోంది. ఈ యాత్రల్లో పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర నాయకులు పాల్గొననున్నారు. తొలి యాత్ర నవంబరు 5న సహరాన్‌పూర్ నుంచి మొదలవుతుంది. మిగతావి ఝాన్సీ నుంచి 6వ తేదీన, సోన్‌భద్ర నుంచి 8న, బాలియా నుంచి 9న ప్రారంభమవుతాయి. ఇవన్నీ డిసెంబరు 24న లక్నోకు చేరి ముగుస్తాయి. ప్రధాని మోదీ ఆరు సభల్లో ప్రసంగిస్తారు.