ఒక్కటైన విపక్షాలు; ఆ ఇద్దరి రూటే వేరు
- యూపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే రచ్చరచ్చ
- గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలిన ఎస్పీ, బీఎస్పీ
- యోగి సర్కారుపై ‘ఉమ్మడి’ పోరుకు పిలుపు
- ఎడమొహం, పెడమొహంగా అఖిలేశ్- శివపాల్
లక్నో: ఉత్తరప్రదేశ్ 17వ అసెంబ్లీ తొలి సమావేశాలు.. విపక్షాల నిరసనల మధ్య రసాభసగా సాగాయి. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత జరుగుతోన్న మొదటి సమావేశాలు కావడంతో అధికార బీజేపీ అసెంబ్లీ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిపాలనా వైఫల్యాలను ఎత్తిచూపుతూ విపక్షలు కూడా అంతే స్థాయిలో నిరసనలు తెలిపాయి.
సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ రామ్‌నాయక్ సోమవారం ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. దీనిని సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. విపక్ష సభ్యులు ఒక దశలో గవర్నర్ పైకి పేపర్లు విసరడంతో సభలో గందరగోళం ఏర్పడింది. మార్షల్స్ అడ్డుగా నిలవగా గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆ సమయంలో స్పీకర్ హృదయనారాయణ్ దీక్షిత్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లు సభలోనే ఉన్నారు.
విపక్షాల ఐక్యత..
యూపీలో బీజేపీ ప్రజావ్యతిరేక పాలన సాగుతున్నదని ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాలని ఎస్పీఎల్పీ నాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన రాంగోవింద్ చౌదరి పిలుపునిచ్చారు. బీజేపీని అడ్డుకోకపోతే అది యూపీ సర్వనాశనం చేస్తుందని ఆయన అన్నారు. బీఎస్పీ పక్ష నేత లాల్జీ వర్మ్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘బీజేపీని, అది సాగిస్తోన్న ప్రజావ్యతిరేక పాలను ఎండగట్టే క్రమంలో భావస్వారూప్యం ఉన్న పార్టీలతో.. అది ఎస్పీ అయినా, మరొక పార్టీ అయినా కలిసి పనిచేయడానికి బీఎస్పీ సిద్ధంగా ఉంది’ అని లాల్జీ వర్మ చెప్పారు.
చెరోదారిలో బాబాయి - అబ్బాయి..
అసెంబ్లీ సమావేశాల తొలిరోజే సభలో అఖిలేశ్‌యాదవ్, శివపాల్ యాదవ్‌లు ఎడమొహం పెడమొహంగా వ్యవహరించారు. అందరికంటే ముందే సభకు వచ్చిన శివపాల్.. ఎస్పీ సభ్యులు అందరితో కలివిడిగా మాట్లాడే ప్రయత్నం చేశారు. గవర్నర్ రాకకు కొద్దిగా ముందు సభలోకి వచ్చిన అఖిలేశ్.. బాబాయిని చూసి కూడా చూడనట్లే ముఖం తిప్పుకున్నారు. ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత శివపాల్.. ములాయం నేృత్వంలో లైకిక ఫ్రంట్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.