అఖిలేశ్ కు అపశకునం
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఎన్నికల ప్రచారానికి ఆరంభంలోనే ఆటంకం ఎదురైంది. వికాస్ రథయాత్ర పేరుతో గురువారం ఆయన అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ జెండా ఊపి రథయాత్ర ప్రారంభించారు. యాత్ర కిలోమీటర్ కూడా సాగకుండానే బ్రేక్ పడింది. అఖిలేశ్ ప్రయాణిస్తున్న అత్యాధునిక మెర్సిడెస్ బస్సు మొరాయించడంతో యాత్ర కొద్దిసేపు ఆగిపోయింది. సాంకేతిక లోపంతో బస్సు నిలిచిపోయింది. తర్వాత అఖిలేశ్ కారులో యాత్ర కొనసాగిసాంచారు.
రథయాత్ర కోసం భారీగా సొమ్ము వెచ్చించి తయారు చేయించుకున్న హైటెక్ బస్సు ఆరంభంలోనే మొరాయించడంతో అఖిలేశ్ అసంతృప్తికి గురయ్యారు. ఇప్పటికే బాబాయి శివపాల్ యాదవ్ తో విభేదాలతో సతమవుతున్న 'అబ్బాయి'కి హైటెక్ బస్సు అపశకునంలా మారింది. ఈ బస్సును కోటి రూపాయలతో స్పెషల్ గా తయారు చేయించుకున్నారు. ప్రచారం కోసం అఖిలేశ్ యాదవ్ హైటెక్ బస్సులు వాడటం ఇది మొదటిసారేమీ కాదు.. ఇంతకుముందు 2012 ఎన్నికల సమయంలో కూడా ఆయన 'క్రాంతి రథం' ఉపయోగించారు.