
సైనికులపట్ల మరోసారి గౌరవాన్ని చాటుకున్న నటుడు
బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ మరోసారి సైనికుల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు.
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ మరోసారి సైనికుల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు. ఇండియా–చైనా సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించాడు. అక్కడ విధులు నిర్వర్తించే సైనికులను, అధికారులను కలిశాడు. ఈ విషయమై ఐటీబీపీ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ... ‘అక్షయ్ స్వయంగా ఇక్కడికి వచ్చి సైనికులను, సైనికాధికారులను కలిశాడు. సైన్యంపట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు. అందరినీ ఆప్యాయంగా పలకరించి, సైనికులు పడుతున్న కష్టాలను గుర్తించాడ’ని చెప్పారు. సైనికులు ఉపయోగించే ఆయుధాలు, ఇతర పరికరాలను స్వయంగా వీక్షించాడని, వాటి గురించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నాడని తెలిపారు. ప్రమాదకరమైన ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో తాము విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటామో వివరించామన్నారు.
మరోవైపు అక్షయ్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ.. ‘అంతటి ప్రతికూల వాతావరణంలో విధులు నిర్వర్తిస్తున్న సైనికుల కష్టమేంటో నాకు తెలుసు. చావును కూడా లెక్కచేయకుండా వారు చూపుతున్న పోరాటపటిమ అసాధారణమైంది. ఐటీబీపీ పోలీసులను కలవడం ఎంతో ఆనందంగా ఉంది. వారిని కలవడం వెనుక ఎలాంటి ప్రత్యేక కారణం లేదు. కేవలం గౌరవభావంతోనే వారి వద్దకు వెళ్లాన’ని ట్విటర్‌లో పేర్కొన్నాడు.