
డబ్బు కష్టాల్లోనూ దిమ్మతిరిగేలా పెళ్లి వేడుక
దేశమంతా పెద్ద నోట్ల రద్దు కారణంగా డబ్బు సమస్యతో ఉక్కిరిబిక్కిరవుతున్న స్థితి. పరిస్థితులు అర్ధం చేసుకొని ముందుకు సాగుతున్న జనం.
తిరువనంతపురం: దేశమంతా పెద్ద నోట్ల రద్దు కారణంగా డబ్బు సమస్యతో ఉక్కిరిబిక్కిరవుతున్న స్థితి. పరిస్థితులు అర్ధం చేసుకొని ముందుకు సాగుతున్న జనం. డబ్బుతో ప్రమేయం లేకుండా జరుగుతున్న పెళ్లిల్లు ఒకవైపైతే.. ఐఏఎస్‌లు అయినా రూ.500లతోనే వివాహాలు జరుపుకుంటున్న పరిస్థితులు మరోవైపు. ఇలా రకరకాల పరిస్థితులు చూస్తున్నప్పటికీ రాజకీయ నాయకుల, బడా వ్యాపారుల రాజభోగాలు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా వారి దర్పాన్ని చూపకనే చూపుతున్నారు. ప్రస్తుతం దేశంలోని పలువురి దృష్టి ఓ వివాహ వేడుకపై పడింది.
అది కేరళలోని ఓ పెళ్లిపై. అక్కడ మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నేత అదూర్ ప్రకాశ్, లిక్కర్ బ్యారెన్ బిజూ రమేశ్ వియ్యంకులు కాబోతున్నారు. రమేశ్ కుమార్తెకు ప్రకాశ్ కుమారుడికి వివాహం జరగబోతోంది. దీని కోసం వారు చేస్తున్న ఆడంబరాలు అంతా ఇంతా కాదు.. దాదాపు ఎనిమిదెకరాల విస్తీర్ణంలో సినిమాను తలపించేలా ఓ భారీ సెట్టింగ్ వేశారు. ప్రవేశ ద్వారంగా మైసూర్ ప్యాలెస్ నమునాను ఏర్పాటుచేశారు. ఇక వివాహ వేదికను అక్షర ధామ్ నమునాలో వేయించారు. దాదాపు 20,000 మంది ఆహ్వానితులకోసం మొత్తం ఏర్పాట్లు కళ్లు చెదిరేలా చేస్తున్నారు. రాజధాని గ్రూఫ్ బార్స్ యజమానిగా, చైర్మన్‌గా రమేశ్ ఉన్నారు. ఈయన గతంలో యూడీఎఫ్ ప్రభుత్వ ఆర్థికమంత్రి కేఎం మణిపై లంఛం ఆరోపణలు చేశారు.
ఆ సమయంలో ప్రస్తుతం తన వియ్యంకుడుగా మారబోతున్న ప్రకాశ్ కూడా మంత్రిగా ఉన్నారు. చాలా నెలలకిందటే తమ పిల్లలకు నిశ్చితార్థం చేయగా ఈ కార్యక్రమానికి రహస్యంగా నాడు మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, సీనియర్ నాయకుడు రమేశ్ చెన్నితాల హాజరవడంపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వీఎం శ్రీధరన్ తీవ్రంగా విమర్శించారు. బిజూ రమేశ్‌పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ స్థలాలను లిక్కర్ షాపులకోసం, బార్ల కోసం కబ్జా చేశాడని, బెదిరింపులకు పాల్పడుతూ వసూళ్లకు పాల్పడ్డాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ పెళ్లికి ఎవరెవరు హాజరవుతారా అని ఇప్పుడు సామాన్య జనం మీడియా మొత్తం ఆ వైపు చూస్తోంది.