జేఎన్‌యూలో ఐసా
సాక్షి, న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) ఎన్నికలను వామపక్షానికి చెందిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) స్వీప్ చేసింది. నాలుగు స్థానాల్లోనూ విజయ దుంధుబి మోగించింది. ప్రత్యర్థులను భారీ మెజార్టీతో మట్టికరిపించింది. అధ్యక్షుడిగా అక్బర్ చౌదరి, ఉపాధ్యక్షుడిగా అనుభూతి ఏగ్నెస్, ప్రధాన కార్యదర్శిగా సందీప్ సౌరవ్, సంయుక్త కార్యదర్శిగా సర్ఫరాజ్ హమీద్ ఎన్నికయ్యారు. మూడు రోజులకు పైగా ఓట్లను లెక్కించిన అధికారులు సోమవారం ఫలితాలను ప్రకటించారు.
మొత్తం 4,589 ఓట్లు పోలయ్యాయని జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికల కమిషనర్ జ్ఞాన్‌ప్రకాశ్ తెలిపారు. అన్ని స్థానాల్లో ఏఐఎస్‌ఏ విజయం సాధించిందన్నారు. అధ్యక్ష పదవికి పోటీపడిన డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (డీఎస్‌ఎఫ్)కు చెందిన ఇషాన్ ఆనంద్, ఎన్‌ఎస్‌యూఐకి చెందిన ప్రాణ్‌వీర్ సింగ్, ఏబీవీపీకి చెందిన ఆలోక్ కుమార్ సింగ్, కన్సర్న్‌స్డూడెంట్స్‌కు చెందిన చంద్రసేన్‌పై ఏఐఎస్‌ఏకు చెందిన అక్బర్ చౌదరి విజయం సాధించారు. ఫిలాసఫీలో డాక్టరేట్ చేస్తున్న చౌదరికి 1,977 ఓట్లు పొలవగా, ప్రత్యర్థి డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (డీఎస్‌ఎఫ్)కు చెందిన ఇషాన్ ఆనంద్‌కు 1,327 ఓట్లు పొలయ్యాయి. ఉపాధ్యక్షుడిగా పోటీ చేసిన హిస్టరీలో ఎంఫిల్ చేస్తున్న ఏఐఎస్‌ఏకు చెందిన ఏగ్నెస్‌కు 1,966 ఓట్లు పోలయ్యాయి. ప్రత్యర్థి డీఎస్‌ఎఫ్‌కు చెందిన జీశాన్ అలీకి 1,052 ఓట్లు పోలయ్యాయి. ప్రధాన కార్యదర్శి పదవీకి పోటీచేసిన స్కూల్ ఆఫ్ లాంగ్వేజేస్ విద్యార్థి సౌరవ్‌కు 1,657 ఓట్లు పోలయ్యాయి.
ఇతను ఎన్‌ఎస్‌యూఐకి చెందిన కారొలిన్ మనైనీని 953 ఓట్లతో మట్టికరిపించాడు. కార్యదర్శి పదవికి పోటీచేసిన ఫ్రెంచ్ మాస్టర్ స్టూడెంట్ హమీద్ 1,705 ఓట్లు పోలయ్యాయి. ఇతను డీఎస్‌ఎఫ్‌కు చెందిన సోనమ్ గోయల్‌ను 59 ఓట్లతో ఓడించాడు. 2012 సంవత్సరంలో మూడు పదవులను గెలుచుకున్న ఏఐఎస్‌ఐకి డీఎస్‌ఎఫ్‌కు మధ్య గట్టిపోరు సాగింది. ‘మా కృషిని విద్యార్థులు గుర్తించారు. గత రెండు నెలల నుంచి వివిధ సమస్యల సాధనకు కృషి చేశాం. మెస్, హాస్టల్ వసతులతో పాటు విద్యార్థుల ఉపకారవేతనాన్ని రూ.200ల నుంచి రూ.500లకు పెంచేలా చొరవ తీసుకున్నామ’ని చౌదరి సోమవారం విలేకరులకు తెలిపారు. వీటన్నింటి వల్లే తాము ఘన విజయం సాధించగలిగామని సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులందరూ చూపించిన ఆదరాభిమానాలు మరవమని, ఇక నుంచి జేఎన్‌యూను ప్రపంచస్థాయి పరిశోధన విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఏగ్నేస్ తెలిపారు.