నేషనల్ జియోగ్రాఫిక్ పోటీలో దుమ్మురేపారు
నేషనల్ జియోగ్రాఫిక్ బీ కాంపిటీషన్ లో భారతీయ అమెరికన్ విద్యార్థులు స్వీప్ చేశారు. తమ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి మొదటి స్థానంతో పాటు, రెండు మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రధాన కార్యాలయం లో జరిగిన 28వ వార్షిక పోటీలో ఫ్లోరిడా కు చెందిన ఆరవ తరగతి విద్యార్థి రిషీ ఫస్ట్ ప్లేస్ కొట్టేసి ప్రతిష్టాత్మక బహుమతిని గెల్చుకున్నాడు. తన సమీప ఇండో అమెరికన్ విద్యార్థులపై పై చేయి సాధించి ఈ భారీ బహుమతిని సొంతం చేసుకున్నాడు.
కేరళకు చెందిన రిషీ నాయర్ (12) ఈ ప్రిస్టీజియస్ అవార్డును దక్కించుకున్నాడు. దీనికి గాను 33 లక్షల ప్రైజ్ మనీని (యాభైవేల అమెరికన్ డాలర్లు) స్కాలర్ షిప్ గా నాయర్ కు అందించనుంది. దీంతో పాటు నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీలో జీవితకాల సభ్యత్వం కూడా లభించనుంది. హోరా హోరీగా నడిచిన పోటీలో పసిఫిక్ మహాసముద్రం ద్వీపసముదాయంలో వేల్స్ లాంటి వన్యప్రాణి సంరక్షణ కోసం సాంక్చురీ ఏర్పాటు చేసిన 'గాలా పగోస్ దీవి' పేరు చెప్పి నాయర్ ఈ విజయం సాధించాడు. మరో ఇద్దరు భారతజాతి అమెరికన్ విద్యార్థులు మసాచు సెట్స్ నుంచి సాకేత్ జొన్నలగడ్డ రెండవస్థానంలో, అలబామా కు చెందిన కపిల్ నాథన్ మూడవ స్థానంలో నిలిచారు.
కాగా గత ఏడాది కరన్ మీనన్ ఈ పోటీలో విజేతగా నిలువగా... ఇండియన్ అమెరికన్ విద్యార్థులకు వరుసగా ఇది అయిదవ విజయం. గత కొన్నేళ్లుగా ఈ పోటీలో భారతసంతతికి చెందిన అమెరికన్ విద్యార్థులు వరుసగా విజయం సాధిస్తుండడం విశేషం.