ఆ షాట్ ను అతని నుంచే నేర్చుకున్నా:ఏబీ
లండన్:ప్రస్తుతమున్న విధ్వంసకర క్రికెటర్లలో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ఒకడు. బంతిని సునాయాసంగా బౌండరీ దాటించడంతో పాటు అనేక రకాల షాట్లను ఆడటంలో ఏబీ సిద్ధహస్తుడు. స్వీప్, రివర్స్ స్వీప్, అప్పర్ కట్, రివర్స్ స్కూప్ ఇలా ఏ షాట్ నైనా ఏబీ చాలా ఈజీగా ఆడగలడు. అయితే స్వీప్ షాట్ ను ఆడటాన్ని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ నుంచి ఏబీ నేర్చుకున్నాడట. ఈ విషయాన్ని ఏబీనే స్వయంగా వెల్లడించాడు.
'నెమ్మదిగా తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని స్ట్రైయిట్ గా ఆడితే వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లే ఆస్కారం ఎక్కువ. అందుకు నేను ఇష్టపడను. అలాంటి బంతిని స్వీప్ షాట్ ద్వారా బౌండరీకి తరలించేందుకు యత్నిస్తా. ఆ షాట్ ను నేర్చుకున్నది యూనిస్ ఖాన్ నుంచి అనే కచ్చితంగా చెప్పగలను. యూనిస్ ఆ షాట్ ఆడే విధానం బాగుంటుంది. అతని వద్ద నుంచి స్వీప్ షాట్ ను ఆడటం నేర్చుకున్నా'అని ఏబీ పేర్కొన్నాడు. ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యలపై యూనిస్ స్పందించాడు. కొంతమంది ఆటగాళ్ల ఆట తీరును పరిశీలించడం సాధారణంగా జరుగుతూ ఉంటుందని యూనిస్ అన్నాడు. అసలు స్వీప్ షాట్లు ఆడటానికి చాలా ధైర్యం కావాలన్నాడు. ఆ షాట్లు ఆడేటప్పుడు అవుటైతే మనకు విమర్శలు కూడా తప్పవన్నాడు. తాను టెస్టుల్లో పదివేల పరుగుల మార్కును చేరేటప్పుడు కూడా స్వీప్ షాట్ నే ఆడినట్లు యూనిస్ తెలిపాడు. మరొకవైపు తాను కూడా డివిలియర్స్ నుంచి కొన్ని షాట్లు ఆడటాన్ని నేర్చుకున్నట్లు యూనిస్ తెలిపాడు.