
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీ కోసం తమ జట్టు మెంటార్‌గా పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం యూనిస్ ఖాన్‌ను ఏసీబీ నియమించింది. ఈ విషయాన్నిఏసీబీ అధికారికంగా బుధవారం ప్రకటించింది.
"ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అఫ్గానిస్తాన్ మెంటార్‌గా పాకిస్తాన్ లెజెండ్ యూనిస్ ఖాన్‌ను ఏసీబీ ఎంపిక చేసింది. అతడు ఈవెంట్ ఆరంభానికి ముందు జట్టుతో అతడు కలవనున్నాడు" అని అఫ్గాన్ క్రికెట్ అధికార ప్రతినిధి సయీద్ నసీమ్ సాదత్ పేర్కొన్నాడు. కాగా యూనిస్ ఖాన్ గతంలో 2022లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు.
అజయ్ జడేజాతో కటీఫ్..
ఇక వన్డే ప్రపంచకప్-2023లో అఫ్గాన్ జట్టు మెంటార్‌గా పనిచేసిన భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజాతో ఈసారి ఏసీబీ ఒప్పందం కుదుర్చుకోలేదు. అతడి మార్గదర్శకత్వంలో అఫ్గానిస్తాన్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక వంటి జట్లను ఓడించి అడుగు దూరంలో తొలిసారి సెమీస్ చేరే అవకాశాన్ని అఫ్గాన్లు కోల్పోయారు.
వరల్డ్‌క్లాస్ జట్లను అఫ్గాన్ ఓడించడంలో అజయ్ జడేజాది కీలక పాత్ర అని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఈ మెగా ఈవెంట్‌లో పాకిస్తాన్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో జడేజాకు వీసా సమస్యలు తలెత్తే అవకాశముంది. అంతేకాకుండా పరిస్థితుల అనుగుణంగా యూనిస్ వైపు ఏసీబీ మొగ్గు చూపినట్లు సమాచారం. అఫ్గానిస్తాన్ టీ20 వరల్డ్‌కప్-2024లో కూడా సంచలన ప్రదర్శన కనబరిచింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా , బంగ్లాదేశ్‌లను ఓడించి తొలిసారి పొట్టి ప్రపంచకప్ సెమీఫైనల్లో అడుగుపెట్టారు.
కోచ్‌గా అనుభవం..
పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజాలలో ఒకరైన యూనిస్ ఖాన్‌కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. గతంలో అతడు పాకిస్తాన్ క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా కూడా పనిచేశాడు. అదే విధంగా పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీ,అబుదాబి T10 లీగ్‌లో బంగ్లా టైగర్స్‌తో కూడా కలిసి పనిచేశాడు. పాక్ తరపున 118 టెస్టులు ఆడిన యూనిస్ ఖాన్ 10,099 పరుగులు చేశాడు. అంతేకాకుండా అతడి సారథ్యంలోనే 2009 టీ20 ప్రపంచకప్‌ను పాక్ సొంతం చేసుకుంది.
చదవండి: ‘బవుమా అలాంటి వాడు కాదు.. డబ్ల్యూటీసీ ఫైనల్లో విజయం మాదే’
Comments
Please login to add a commentAdd a comment