మహిళా శిశు సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ఆ మంత్రిత్వ శాఖ.. దేశంలోని సుమారు 250 మంది మహిళా జర్నలిస్టులతో సమావేశమైంది. రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను వారికి వివరించడంతో పాటు అభివృద్ధికి చేపట్టాల్సిన సలహాలు సూచనలు ఇవ్వాలని ఆహ్వానించింది.
ఉమెన్ జర్నలిస్ట్ వర్క్ షాప్ పేరిట న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మహిళా శిశు సంక్షేమశాఖ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళా జర్నలిస్టులతో అభివృద్ధిపై ముచ్చటించిన కేంద్ర మంత్రి మనేకా గాంధీ... జర్నలిస్టుల సలహాలను, సూచనలను కోరారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహకారంతో మహిళా శిశు అభివృద్ధి శాఖ నిర్వహించిన కార్యక్రమానికి దేశంలోని సుమారు 30 రాష్ట్రాలు, మూడు వేర్వేరు మాధ్యమాల నుంచి 250 మంది దాకా మహిళా పాత్రికేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా శిశు సమస్యలు, పనిచేసే చోట మహిళల పరిస్థితి వంటి అనేక విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో మనేకా గాంధీ... మహిళలు, పిల్లల సమస్యలపై వివరణాత్మక మెళకువలను అందించడంతోపాటు... జర్నలిస్టులు వెలుగులోకి తెచ్చిన సమస్యలపై స్పందించారు. వివిధ శాఖల ద్వారా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. మహిళలు, బాలల హక్కుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై పాత్రికేయుల అభిప్రాయాలను కోరారు. ఈ సందర్భంలో జర్నలిస్టులు ఇప్పటికే దేశంలో ప్రబలంగా ఉన్న 'విచ్ హంట్', 'నట పరాటా' వంటి సమస్యలను వెలుగులోకి తేగా... ఇటువంటి తీవ్రమైన ఆచారాలను, వివక్షతను నిర్మూలించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే చివరి నిమిషంలో పేషెంట్లను ఆస్పత్రికి తీసుకొచ్చే పరిస్థితులు, రక్తమార్పిడి వల్ల హెచ్ఐవీ సోకిన సంఘటనలను మహిళా జర్నలిస్టులు మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు.
ఈ సందర్భంగా సబల వంటి ప్రణాళికలతో డబ్ల్యూసీడీ మంత్రిత్వశాఖ సాధించిన విజయాలను మనేకా గాంధీ పాత్రికేయులకు వివరించారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా వారికి కావలసిన సహకారం అందించడం, డ్రాపవుట్స్ ను నిర్మూలించడం వారిలో మరింత అవగాహన పెంచడం అవసరమన్న ఆమె... మొదటిసారి అసోంలో హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులకు షెల్టర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్... డబ్ల్యూసీడీ సాధించిన విజయాలను మహిళా జర్నలిస్టులకు వివరించారు. ఉజ్జ్వల్ యోజన, ధన్ వికాస్ వంటి వివిధ పథకాలను వివరిస్తూ... వాటిపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం, వాటి వినియోగంపై జనంలో అవగాహన కల్పించడంలో జర్నలిస్టులు తగిన బాధ్యత తీసుకోవాలని కోరారు. ఎస్సీ ఎస్టీ మహిళల వ్యవస్థాపకతను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పథకాలను ప్రారంభించినట్లు ఈ సందర్భంగా నిర్మలా తెలిపారు.
మహిళా జర్నలిస్టులతో మనేకా గాంధీ భేటీ
Published Thu, Jun 9 2016 6:02 PM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM
Advertisement