
సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళాలు దాడులు జరిపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. భారత వైమానిక సిబ్బంది జరిపిన దాడిని క్లీన్ ఆపరేషన్‌గా ప్రభుత్వం వర్ణించింది. నాన్ మిలటరీ అపరేషన్ జరిగినట్లు, జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలే టార్గెట్‌గా దాడిచేశామని ప్రభుత్వం ప్రకటించింది. వాయుసేన దాడుల గురించి అఖిలపక్షంలో పాల్గొన్న నేతలకు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వివరించారు.
భారత దాడులకు ఉగ్రవాదులు ప్రతిదాడికి ప్రయత్నిస్తే ఏవిధంగా స్పందించాలన్న దానిపై కూడా అఖిలపక్షం చర్చించింది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ భవనంలో ఈ సమావేశం జరిగింది. సుష్మాస్వరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రక్షణ శాఖమంత్రి నిర్మలా సీతారామన్, అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్, ఒమర్ అబ్దుల్లా, డీ రాజా, సీతారాం ఏచూరి, విజయ్ గోయల్, ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. కాగా దాడి గురించి ఇప్పటికే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతికి ప్రధాని మోదీ వివరించిన విషయం తెలిసిందే.