డెహ్రడూన్: ఆ గ్రామంలో ఎవరిని కదిలించినా తమ పుట్టిన రోజు జనవరి 1 అనే చెబుతారు.. కావాలాంటే ఆధార్ కార్డునూ ఆధారంగా చూపుతారు. ప్రతి వ్యక్తికీ విశిష్ట గుర్తింపు సంఖ్యను ఇచ్చే ఆధార్ ప్రాజెక్టు అధికారుల అలసత్వంతో ఇలా తయారైందని ఆ గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హరిద్వార్‌కు కూతవేటు దూరంలో ఉండే గైండి ఖత గ్రామంలో 800 కుటుంబాల వారికి ఆధార్ కార్డుల్లో జనవరి 1న జన్మించినట్టు పొందుపరిచారు. ఆధార్ కార్డులు అందించే ప్రైవేటు ఏజెన్సీతోనే తమకు ఓటర్ ఐడీ కార్డులు, రేషన్ కార్డులు ఇప్పించారని స్థానికులు చెప్పారు.
తమ పుట్టిన రోజులన్నీ ఒకే రకంగా ఉండటంతో ఇంకేం విశిష్టత ఉందని ఆధార్ తీరును తప్పుపడుతూ గ్రామస్తుడు అల్ఫదీన్ వాపోయారు. అధికారుల అలక్ష్యం ఈ ఒక్క గ్రామానికే పరిమితం కాలేదని దేశవ్యాప్తంగా ఇదే తంతు కొనసాగిందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో ఆగ్రా జిల్లాలోని మూడు గ్రామాల్లోనూ పలువురి పుట్టిన తేదీలు జనవరి 1గా అధికారులు నమోదు చేశారు. అలహాబాద్ సమీపంలోని కంజస గ్రామంలోనూ ఇదే పరిస్థితి.
ఆధార్ కార్డులు అందగానే వాటిపై ప్రతి ఒక్కరి పుట్టిన తేదీ జనవరి 1గా ఉండటం చూసి విస్తుపోయామని గ్రామస్తులు చెప్పుకొచ్చారు. ఇక పుట్టిన సంవత్సరం కూడా రేషన్ కార్డులు, ఓటర్ కార్డులతో సరిపోలడం లేదని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment