స్కూల్ డ్రాపౌట్...డిప్యూటీ సీఎం
పట్నా: రాజకీయాల్లో సరైన అనుభవం లేకపోవడమే కాకుండా 9వ తరగతిలోని చదువుకు స్వస్తి చెప్పి బలాదూర్ తిరిగిన మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ (26)కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడంపై సోషల్ మీడియా రగిలిపోయింది. మరో కుమారుడు తేజ్ ప్రతాప్‌కు కూడా మంత్రి పదవి ఇవ్వడం పట్ల మండిపడింది.
పుత్ర వాత్సల్యాన్ని చూపించేందుకు ఇంతకన్నా మరో మార్గం దొరకలేదా లాలూజీ! అంటూ ప్రశ్నించింది. వారసత్వ రాజకీయాలకు పరాకాష్ట అంటూ విమర్శించింది. తేజస్వి యాదవ్‌కు రెండేళ్లు పెద్ద వాడైన తేజ్ ప్రతాప్ తన ప్రమాణ స్వీకారం చేస్తూ ఒక పదానికి బదులు మరో పదాన్ని తప్పుగా ఉచ్ఛరించడాన్ని ఉదహరించింది. ‘ఆపేక్షిత్(అంచనాలు)’కు బదులుగా ‘ఉపేక్షిత్ (నిర్లక్ష్యం చేయడం)’ అనడం రాజకీయ అనుభవరాహిత్యానికి నిదర్శనం కాదా? అంటూ నిలదీసింది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని చురకలు...
‘ఐపీఎల్ సిరీస్‌లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్ టీమ్‌కు నాలుగు సీజన్లలో ప్రాతినిధ్యం వహించి ఒక్క గేమ్‌లో కూడా ఆడని తేజస్వి యాదవ్, ఇప్పుడు ఇండియన్ పొలిటికల్ లీగ్‌కు వచ్చారు....నీవు ఏది కావాలనుకుంటే భారత ప్రజాస్వామ్యం అది ఇస్తుంది. తొమ్మిదే తరగతి చదివిన తేజస్వికి డిప్యూటి సీఎం పదవి ఇచ్చింది.
ప్రజాస్వామ్యం వర్ధిల్లుగాక!...తేజస్వి లాంటి వాళ్లే డెమోక్రసిని అనుభవిస్తారు, వారసత్వ రాజకీయాలకు సిగ్గు,సిగ్గు....విద్య విజయానికి సోపానం అనేవారికి ఇది చెంపపెట్టు, తేజస్విని చూసి నేర్చుకోండి....లాలూకు 9 మంది సంతానం, వారిలో ఇద్దరు మాత్రమే మంత్రులయ్యారు, ఇంకా ఏడుగురు మిగిలే ఉన్నారు పాపం...’ అనే కామెంట్లు చక్కెర్లు కొడుతున్నాయి..