టీచర్లను పీఏలుగా నియమించొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మంత్రులు, ఎమ్మెల్యేలకు వ్యక్తిగత సహాయకులు(పీఏ)గా టీచర్లను నియమించొద్దని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. డిప్యుటేషన్పై పీఏలుగా పనిచేస్తున్న వారిని వెనక్కు పిలవాలని సలహాయిచ్చింది. తెలంగాణలో 'జీరో స్కూల్స్'పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై నివేదికను అత్యున్నత న్యాయస్థానానికి అమికస్ క్యురీ అందజేసింది.
ఎంఈవో, డీఈవో పోస్టులు ఎందుకు ఖాళీగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ పాఠశాలలపై ఎందుకు నమ్మకం కలిగించలేకపోతున్నారని అడిగింది. అన్ని అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. 398 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడంతో సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.