
మోదీ,పారికర్ ను చంపేస్తాం- ఐఎస్ఐఎస్
పనాజి: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోది, రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్లను చంపేస్తామంటూ ఐఎస్ఐఎస్ పేరుతో వచ్చిన ఓ లేఖ ఉద్రిక్తతను రాజేసింది. గత వారం గోవా రాష్ట్ర సెక్రటేరియట్కు ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ సంస్థ) పేరుతో ఈ లేఖ వచ్చినట్లు రాష్ట్ర నిఘా విభాగం చెబుతోంది. దాంతో పోలీస్ బలగాలను, భదతా దళాలను అప్రమత్తం చేసింది. ఐఎస్ఐఎస్ అని సంతకం చేసి పోస్ట్ చేసిన ఈ పోస్ట్ కార్డు కాపీని యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ అన్ని పోలీస్ స్టేషన్లకు పంపింది.
కాగా నరేంద్ర మోది, పారేకర్లను చంపేస్తామంటూ తమ కు ఒక లేఖ చేరిందని గోవా పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశామన్నారు. పోస్ట్ కార్డ్ పై సంతకం మాత్రమే ఉన్న ఈ లేఖలో గోవధ నిషేధంపై ఆగ్రహం వ్యక్తం చేశారని, అయితే ఎవరు రాశారనే వివరాలేవీ ఆ లేఖలో లేవని పేర్కొన్నారు. దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.