ముంబై: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని మానేయాలన్న ప్రధాని నరేంద్రమోదీ పిలుపుకు విశేష స్పందన లభిస్తోంది. సినీ, రాజకీయ, వ్యాపార వర్గాలు మోదీ పిలుపు మేరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ‘కూలీ నెం.1’ సినిమా షూటింగ్‌లో ప్లాస్టిక్ వాడకూడదని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ప్రధాని మోదీ అభినందించారు. తాజాగా కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర కూడా ఆదే బాటలో పయనిస్తున్నారు.
తన కంపెనీ బోర్డు రూముల్లో, సమావేశాల్లో ప్లాస్టిక్ బాటిళ్లను వాడకూడదని నిర్ణయించారు. స్టీల్, రాగి బాటిళ్లనే వాడాలని బోర్డు సభ్యులను కోరారు. తన నిర్ణయాన్ని ఆచరణలో పెట్టిన బోర్డు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అయితే గత జులైలోనే బోర్డు సమావేశాల్లో, రూముల్లో ప్లాస్టిక్ బాటిళ్ల స్థానంలో స్టీల్ బాటిళ్లను వాడాలని ఆనంద్ మహీంద్రకు ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. దీనికి బదులుగా ‘ప్లాస్టిక్ బాటిళ్లను నిషేదించాలి. ప్రస్తుత పరిస్థితులకు మనమందరమూ కారణమే. తప్పకుండా మీ సూచనను పాటిస్తాం’అంటూ రిట్వీట్ చేశారు. అయితే ప్లాస్టిక్ వాడకంపై యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇచ్చిన మాటను మహీంద్ర నిలబెట్టుకున్నారని నెటిజన్లు కొనియాడుతున్నారు.
గతంలో కూడా సోషల్ మీడియా వేదికగా పలువురికి ప్రత్యక్షంగా, పరోక్షంగా తన వంతు సహాయం అందేలా చేశారు ఆనంద్ మహీంద్ర. తాజాగా రూపాయికే ఇడ్లీ అమ్ముతూ పేదవారి ఆకలి తీరుస్తున్న 'ఇడ్లీ బామ్మ’కు ఉచితంగా వంట గ్యాస్ అందేలా చేశారు. కేరళ వరద బాధితుల సహాయార్థం తన సైకిల్‌ను ఇచ్చిన చిన్నారి మంచి మనసుకు చలించిపోయిన ఈ కార్పొరేట్ దిగ్గజం ఆ చిన్నారికి సైకిల్‌ను కానుకగా అందించాడు. తాజాగా ప్లాస్టిక్ వాడకంపై ఆనంద్ మహీంద్ర తీసుకున్న నిర్ణయంపై మాట ఇస్తే నిలబెట్టుకుంటారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment