
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ట్రాఫిక్ కష్టాలకు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర సరికొత్త పరిష్కారం చూపారు. అయితే ఆయన చూపిన పరిష్కారం చట్టపరంగా ఆమోదయోగ్యమైనది కాకపోవడం గమనార్హం. తన కంపెనీ ప్రత్యేకంగా ఐక్యరాజ్యసమితి కోసం డిజైన్ చేసి రూపొందించిన వాహనం ఫోటోలను ఆనంద్ మహీంద్ర మంగళవారం ట్విటర్‌లో షేర్ చేస్తూ ముంబై ట్రాఫిక్‌కు ఈ వాహనాలు సరిగ్గా సరిపోతాయని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి శాంతి సేనలకు ఉపకరించేలా ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఈ వాహనాలు ఐఈడీ వంటి పేలుడు పదార్ధాలను పసిగట్టి ఏరివేసేలా వీటిని మహీంద్రా అండ్ మహీంద్రా అభివృద్ధి చేసింది. ఈ వాహనాన్ని మీన్ మెషీన్‌గా ఆనంద్ మహీంద్రా అభివర్ణిస్తూ మహీంద్రాడిఫెన్స్ స్ఫూర్తిని ఇది ప్రతిబింబిస్తుందని ట్వీట్ చేశారు.
ఆపై ముంబై ట్రాఫిక్‌కు ఇది సరిగ్గా సరిపోతుందని వ్యంగ్య ధోరణిలో పేర్కొన్నారు. వీధుల్లో ప్రయాణించేందుకు అనుమతిస్తే ఇది ముంబై ట్రాఫిక్ కష్టాలకు సరైన పరిష్కారమని చమత్కరించారు. ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు 9000కు పైగా లైక్‌లు రాగా, పలువురు ఈ వాహనాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు. ముంబైకు ఈ వాహనం సరిగ్గా సరిపోతుందని మహీంద్రా వ్యంగ్యంగా వ్యాఖ్యానించినా ముంబైకర్లకు ట్రాఫిక్ కష్టాలు చుక్కలు చూపుతాయి. ముంబై వాసులు ఏడాదిలో సగటున 11 రోజులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోతారని ఓ నివేదిక పేర్కొంది. చదవండి : కరోనా స్పెషల్ ఆటో చూడండి