
ఏకాభిప్రాయాన్నే కోరుకుంటున్నాం!
రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఏకాభిప్రాయానికే తమ పార్టీ మొగ్గుచూపుతోందని కాంగ్రెస్ గురువారం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని అధికార పక్షం అర్థం చేసుకుంటే బాగుంటుందని పేర్కొంది. ‘ప్రతి ముఖ్యమైన అంశంలో ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాలని కాంగ్రెస్ మొదట్నుంచీ భావిస్తోంది. కానీ రాష్ట్రపతి ఎన్నికపై ఇంకా స్పష్టత రావటం లేదు. ఈ విషయంలో ఏకాభిప్రాయంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తే బాగుంటుంది.
అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తినే రాష్ట్రపతిగా ఎన్నుకోవటమే మంచిది’ అని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ అన్నారు. కేంద్రం ఏం ఆలోచిస్తుందో చెప్పలేమన్న శర్మ.. దేశానికి వ్యతిరేకంగానే వారు ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. ప్రణబ్‌ముఖర్జీని ఏకగ్రీవంగా రాష్ట్రపతిని చేద్దామనుకున్నప్పుడు.. నాడు బీజేపీ మరో అభ్యర్థిని బరిలో దింపి మానసిక దివాళాకోరుతనాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు. కాగా, బీజేపీ ఏర్పాటుచేసిన త్రిసభ్య బృందం నేడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలవనుంది.
అడ్వాణీ అయితేనే బెటర్!
ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ పేరును ప్రతిపాదిస్తే బాగుంటుందని ఆ పార్టీ నేత శతృఘ్న సిన్హా అన్నారు. అత్యున్నత పదవికి అడ్వాణీని మించిన అర్హులు ఇంకెవరున్నారని సిన్హా ప్రశ్నించారు. అడ్వాణీ శారీరకంగా, మానసికంగా బలంగానే ఉన్నారని వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. ‘రాజ్యాంగంలోని సంక్లిష్టతలను అర్థం చేసుకుని దేశ హితం కోసం పనిచేసే సత్తా ఇంకా అడ్వాణీలో ఉంది. ఆయన ఎవరి ఒత్తిళ్లకు లొంగరు’ అని సిన్హా ట్వీట్ చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఎన్డీయేతోపాటు ఇతర విపక్షాల్లోనూ ఎవరూ వ్యతిరేకించరన్నారు.