శివసేన ఎంపీ వీరంగం
‘రోజా’ ఉన్న ముస్లిం ఉద్యోగికి బలవంతంగా ఆహారం తినిపించేందుకు ప్రయత్నం
గతవారం జరిగిన ఘటన; వార్తాచానళ్లలో బుధవారం వీడియో ప్రసారం
దద్దరిల్లిన పార్లమెంటు; ఉభయసభల్లో గందరగోళం; పలుమార్లు వాయిదా
న్యూఢిల్లీ: ఢిల్లీలోని మహారాష్ట్ర ప్రభుత్వ అతిధి గృహం న్యూ మహారాష్ట్ర సదన్‌లో గతవారం ఒక శివసేన ఎంపీ చేసిన దాష్టీ కం తాజాగా వెలుగులోకి వచ్చింది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రోజా(ఉపవాసం) ఉంటున్న అర్షద్ జుబెయిర్ అనే ముస్లిం ఉద్యోగికి శివసేన ఎంపీ రాజన్ విచారే బలవంతంగా ఆహారం తినిపించేందుకు ప్రయత్నించిన ఘటన రాజకీయంగా పెనుదుమారం లేపింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో బుధవారం పలు వార్తా చానళ్లలో ప్రసారం కావడంతో..
ఎంపీ చర్యపై సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. పార్లమెంటులోనూ విపక్ష సభ్యులు ఈ ఘటనపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. బాధ్యులైన ఎంపీపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది చాలా సున్నితమైన అంశమని, వాస్తవాలు వెల్లడయ్యేంతవరకు సంయమనం పాటించాలని, దీనికి మతం రంగు పులమవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తమ పార్టీ హిందుత్వ మద్దతుదారైనప్పటికీ.. తమకు ఇతర మతాలపై వ్యతిరేకత లేదని శివసేన స్పష్టం చేసింది. ‘మా పార్టీ గొంతుకను అణిచేందుకు జరుగుతున్న ప్రయత్నమే ఇది. మాది హిందుత్వవాదమే అయినా.. మాకు ఇతర మతాలపై ద్వేషం లేదు’ అని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఔరంగాబాద్‌లో స్పష్టం చేశారు.
రోటీలు బాగా లేవని..
గతవారం మహారాష్ట్ర సదన్‌లోని క్యాంటీన్‌లో భోజనం చేసేందుకు శివసేన ఎంపీలు వెళ్లారు. అక్కడ వారికి వడ్డించిన రోటీ(చపాతీ)లు గట్టిగా, తినడానికి వీల్లేకుండా ఉండటంతో.. ఫిర్యాదు చేసేందుకు సదన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కమిషనర్ కోసం గంటకు పైగా ఎదురుచూసి.. ఆయన రాకపోవడంతో ఆగ్రహంతో మళ్లీ క్యాంటీన్‌లోకి వెళ్లి అక్కడి ఉద్యోగి అర్షద్ జుబెయిర్‌ను ఆహార నాణ్యత విషయమై ప్రశ్నించారు. ఆ సందర్భంగా మిగతా ఎంపీలు చూస్తుండగా ఆగ్రహంతో ఎంపీ రాజన్ విచా రే ఉద్యోగి అర్షద్ నోట్లో రోటీని బలవంతంగా కుక్కేందుకు ప్రయత్నించారు. భయంతో వణికిపోతూ ఆ ఉద్యోగి అలా చేయవద్దంటూ వేడుకోవడం, ఆ ఉద్యోగి పేరు కూడా అతని షర్ట్‌పై కనిపిస్తుండటం వీడియోలో స్పష్టంగా ఉంది. తన వీడియో పలు చానళ్లలో ప్రసారం కావడంతో.. తన ప్రవర్తనపై విచారం వ్యక్తం చేశారు. ఆ సమయంలో తనకు ఆ ఉద్యో గి పేరు, కులం, మతం.. ఇవేవీ తెలియవని పేర్కొన్నారు. టీవీల్లో చూసిన తరువాతే అతను ముస్లిం అని తెలిసిందన్నా రు. సదన్‌లో నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్న విషయాన్ని అధికారులకు తెలియజేసేందుకు మాత్రమే తాను ప్రయత్నించానన్నారు. సదన్‌లోని క్యాంటీన్‌లో తమకు ఉడికీ ఉడకని కూరలు, చేత్తో తుంచలేని రోటీలను వడ్డిస్తున్నారన్నారు.
పార్లమెంట్లో గందరగోళం
మిత్రపక్షమైన శివసేన ఎంపీ చర్య ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టింది. పార్లమెంటులోని ఉభయసభల్లోనూ ఈ అంశంపై గందరగోళం చెలరేగి, వాయిదాలకు దారితీసింది. లోక్‌సభలో జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్ సభ్యుడు ఎంఐ షానవాజ్.. లౌకికవాద మూలాలనే ఇది నరికేస్తుందని వ్యాఖ్యానించారు. ‘మైనారిటీల నమ్మకం వమ్మయింది. ఈ ఘటనను సభ ఖండించాలి’ అని డిమాండ్ చేశారు. రంజాన్ నెలను గౌరవించే సభ్యులు సభలో తప్పుడు ప్రకటనలివ్వవద్దని సేన ఎంపీ, కేంద్ర మంత్రి అనంత్ గీతే అన్నారు. మోడీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. శివసేన ఎంపీలపై ఆరోపణలను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. ‘ఇది చాలా సున్నితమైన అంశం. మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించొద్దు. అసలా ఘటన జరిగిందో లేదో.. వాస్తవాలేంటో ఎవరికీ తెలియదు. విచారణ జరగాల్సి ఉంది. దీనిపై ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపించవద్దు. ఈ ఘటనకు, ప్రభుత్వానికి సంబంధం లేదు’ అన్నారు.
బిదూరి అభ్యంతరకర వ్యాఖ్యలు
ఈ సందర్భంగా బీజేపీ సభ్యుడు రమేశ్ బిదూరి వెల్‌లోకి దూసుకొచ్చి ‘ఇది భారతదేశం..’ అంటూ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై సభలో మరోసారి గందరగోళం చెలరేగింది. ఆగ్రహంతో ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ, ఆర్జేడీ సభ్యుడు పప్పూ యాదవ్‌లు వెల్‌లోకి దూసుకెళ్లారు. బిదూరితో వాగ్వాదానికి దిగారు. వారు ఓ దశలో కొట్టుకునేందుకు సిద్ధమన్నట్లుగా షర్టు చేతులను వెనక్కి మడవడం కూడా కనిపించింది. పరిస్థితిని గమనించిన బీజేపీ సీనియర్ నేత బిదూరిని కోప్పడి తనసీట్లో కూర్చోవలసిందిగా ఆదేశించారు. తన సీట్లో కూర్చున్న తర్వాత రమేష్ బిదూరి తన వ్యాఖ్యకు క్షమాపణ చెప్పారు. బీజేపీ ఎంపీ ప్రవర్తనను తమ పార్టీ ఆమోదించదని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. శివసేన ఎంపీలను సెక్షను 153 కింద అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపాలని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ముస్లిం ఉద్యోగి ఉపవాసాన్ని బలవంతంగా భంగపర్చడానికి శివసేన ఎంపీలు చేసిన దారుణాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని పిలుపునిచ్చారు. ముస్లిం ఉద్యోగి నోట్లోకి శివసేన ఎంపీలు బలవంతంగా చపాతీ కుక్కడం దుర్మార్గచర్యగా పేర్కొన్నారు.
ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీ ముందుంచాలని లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. అనంతరం ప్రభుత్వ తీరుకు నిరసనగా కాంగ్రెస్, ఎన్‌సీపీ, వామపక్షాలు, పీడీపీ, ఎంఐఎం సభ్యులు వాకౌట్ చేశారు. రాజ్యసభలో ఈ అంశంపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో సభ పలుమార్లు వాయిదా పడింది.
‘అది తప్పు’ అంటూ శివసేన ఎంపీ చర్యపై బీజేపీ అగ్రనేత అద్వానీ స్పందించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటున్న ముస్లిం ఉద్యోగికి బలవంతంగా ఆహారం తినిపించాలని ప్రయత్నించడం వారి మనస్తత్వాన్ని, వారి ఆలోచనాధోరణిని బట్టబయలు చేస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, అలాగే తక్షణం విచారణ ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కూడా ఆదేశించాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్‌కు ఒక లేఖ రాశాయి. ఆ లేఖపై కాంగ్రెస్, ఆర్జేడీ, ఎన్సీపీ, ఆరెస్పీ, సీపీఎం, ఐయూఎంఎల్ పార్టీలకు చెందిన ఎంపీలు సంతకం చేశారు.
‘బలవంతంగా నోట్లో కుక్కారు’
జరిగిన ఘటనపై బుధవారం సదన్ రెసిడెంట్ కమిషనర్‌కు అర్షద్ జుబెయిర్ ఫిర్యాదు చేశారు. ‘నా పేరు ఆ ఎంపీకి తెలుసు.. నేను ధరించిన చొక్కాపై కూడా నా పేరు ఉంది.. అయినా బలవంతంగా నా నోట్లో చపాతీలు కుక్కారు’ అని అందులో అర్షద్ పేర్కొన్నారు. ‘నేను ముస్లింనని తెలిసే.. బలవంతంగా రోటీలు తినిపించారు. దానివల్ల రంజాన్ మాసంలో నా ఉపవాస దీక్ష భగ్నమైంద’ని అర్షద్ వివరించారు. ఐఆర్‌సీటీసీ నిర్వహిస్తోన్న ఆ క్యాంటీన్‌లో కేటరింగ్ సూపర్‌వైజర్‌గా అర్షద్ పనిచేస్తున్నారు.