పరస్పర దూషణకు దిగిన అధికార, విపక్షాల ఎంపీలు
న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ)బిల్లును సమీక్షిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశం వాడీవేడీ చర్చలకు వేదికగా మారింది. అధికార బీజేపీ, విపక్ష పార్టీల ఎంపీలు వాగ్వాదానికి దిగారు. చివరకు విపక్ష ఎంపీలు సమావేశాన్ని బహిష్కరిస్తూ బయటకు వెళ్లిపోయారు. నియమనిబంధనలకు విరుద్ధంగా కమిటీ సమావేశం జరుగుతోందని ఆరోపించారు. పార్లమెంట్ సంయుక్త కమిటీలో చర్చ సజావుగా సాగట్లేదని, నియమాలను పాటించడం లేదని శివసేన ఎంపీ సావంత్ మీడియాతో చెప్పారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వంటి సీనియర్ విపక్ష నేతలపై కొందరు తీవ్రమైన వ్యక్తిగత దూషణలకు దిగారని విపక్షసభ్యులు ఆరోపించారు. తమ తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు విపక్షాల సభ్యులు విడిగా సమావేశమయ్యారు. పార్లమెంట్ సంయుక్త కమిటీ సమావేశంలో జరిగిన వాగ్వాదంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేయాలని కొందరు విపక్షసభ్యులు తమ అభిప్రాయం వ్యక్తంచేశారు. విపక్ష ఎంపీలు బయటకు వెళ్లిపోయాక బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ సారథ్యంలో కమిటీ సమావేశం యథావిధిగా కొనసాగింది.
ఖర్గేపై విమర్శలు
వక్ఫ్ భూముల కుంభకోణంతో కర్ణాటకకు చెందిన ఖర్గే, రెహ్మాన్ ఖాన్‌లకు ప్రమేయం ఉందని కర్ణాటక బీజేపీ నేత అన్వర్ మణిప్పాడి ఆరోపణలు గుప్పించారు. దీంతో విపక్షసభ్యులు వాగ్వాదానికి దిగారు. సభలో లేని వ్యక్తిపై నిబంధనలకు విరుద్ధంగా పార్లమెంటరీ కమిటీలో ఆరోపణలు ఎలా చేస్తారని వాదించారు. ముస్లింలకు సంబంధించిన చట్టంపై హిందూ వర్గాల అభిప్రాయాలను ఎందుకు ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటున్నారు?. ముస్లింల అభిప్రాయాలు పట్టవా? అని విపక్ష సభ్యులు నిలదీశారు.
కమిటీ చీఫ్‌కి ఒవైసీ లేఖ
కమిటీ చీఫ్ జగదాంబికాపాల్‌కు ఒవైసీ ఒక లేఖ రాసినట్లు తెలుస్తోంది. ‘‘సనాతన్ సంస్థ, హిందూ జనజాగృతి సమితి వంటి సంస్థలు హిందూ అతివాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి. భారత్‌ను హిందూదేశంగా మార్చడమే వారి లక్ష్యం. భారత సర్కార్‌కు వ్యతిరేకంగా ఆయా సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి’’ అని లేఖలో ఒవైసీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment