* సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ నిర్ణయం
సాక్షి, బెంగళూరు: సాధారణంగా మంత్రుల బిడ్డల వివాహ కార్యక్రమాలు అత్యంత ఆడంబరంగా, తమ వద్ద ఉన్న సంపదను చాటుకునేలా జరగడం సర్వసాధారణం. అయితే రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి మాత్రం ఇందుకు భిన్నంగా నిర్ణయం తీసుకున్నారు. తన కుమార్తె వివాహాన్ని సామూహిక వివాహాల్లో అత్యంత సాధారణంగా జరిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ఆయన కుమార్తె కూడా అంగీకరించడంతో ఈ వివాహం ఓ వినూత్న ఆలోచనకు వేదికగా మారనుంది.
ఇక ఈ నిర్ణయం తీసుకున్న వ్యక్తి మరెవరో కాదు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ. అవును మంత్రి ఆంజనేయ పెద్ద కుమార్తె అనుపమ, రాష్ట్ర ప్రజాపనుల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేఖరప్ప పెద్ద కుమారుడు శాశ్వత్‌ల వివాహం ఈనెల 19న జరగనుంది. చిత్రదుర్గలోని హోళల్కెరె శ్రీకొట్రెనంజప్ప కాలేజు మైదానంలో మొత్తం 96 మంది పేద యువతీ, యువకులు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు.
ఇదే వేదికపై మంత్రి కుమార్తె అనుపమ వివాహం కూడా జరగనుంది. తన కుమార్తె వివాహానికి కేటాయించిన మొత్తంలోనే ఈ జంటలకు వివాహ వస్త్రాలు, తాళితో పాటు వారి జీవన ఉపాధికి అవసరమైన ఒక గేదె, ఒక కొబ్బరి మొక్కను సైతం మంత్రి ఆంజనేయ అందజేయనున్నారు. వివాహ కార్యక్రమాల కోసం అధిక మొత్తంలో ధనాన్ని వెచ్చించరాదనే ఆలోచనతోనే ఈ విధంగా తన కుమార్తె వివాహాన్ని జరిపేందుకు నిర్ణయించానని, ఇందుకు తన కుమార్తె అనుపమతో పాటు ఆమెకు కాబోయే భర్త శాశ్వత్ కూడా అంగీకారం తెలపడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని మంత్రి ఆంజనేయ తెలిపారు.
సామూహిక వివాహాల్లో మంత్రి కుమార్తె పెళ్లి !
Published Mon, Nov 17 2014 3:12 AM | Last Updated on Mon, Oct 22 2018 7:32 PM
Advertisement