
కపిల్ షోలో అన్నా హజారే
ముంబై: పాపులర్ కమెడియన్ కపిల్ శర్మ షోకు ప్రముఖ గాంధేయవాది అన్నా బాబూరావు హజారే వెళ్లారు. తన జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా ప్రమోషన్లో భాగంగా శుక్రవారం కపిల్ షోకు హాజరయ్యారు. హజారే ఒక టీవీ షోలో పాల్గొనడం ఇదే మొదటిసారి. తన సినిమా కచ్చితంగా ఆసక్తిగా ఉంటుందని ఆయన చెప్పినట్టు సమాచారం.
130 నిమిషాల నిడివిగల ఈ సినిమాను యేడాది కాలంగా నిర్మిస్తున్నారు. రైస్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించగా, శశాంక్ ఉదాపుర్కర్ దర్శకత్వం వహించారు. హజారే స్వగ్రామమైన రాలెగావ్ సిద్ధితో పాటు మరిన్ని రాష్ట్రాలలో ఈసినిమాను చిత్రీకరించారు. రంజిత్ కపూర్, శరత్ సక్సేనా, గోవింద నమడియో కీలక పాత్రలు పోషించారు. ఇటీవల మూవీ టీజర్ కూడా విడుదల చేశారు. ఈ సినిమా దేశవ్యాప్తంగా అక్టోబర్ 14న విడుదల చేయనున్నారు.