
భోగ్‌నాదిహ్ (జార్ఖండ్): పాకిస్తానీయులందరికీ భారతీయ పౌరసత్వం కల్పిస్తామని ప్రకటించే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా? అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని పునరుద్ధరించి, ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసే ధైర్య సాహసాలు ఆ పార్టీకి ఉన్నాయా అని సవాల్ విసిరారు. జార్ఖండ్‌లో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మంగళవారం మోదీ మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టంతో భారత్‌లో పౌరులకు ఎలాంటి హాని జరగదని ఆయన పునరుద్ఘాటించారు.
ప్రజాస్వామ్యయుతంగా చర్చిద్దాం
జామియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసు చర్యల్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న విద్యార్థుల నిరసన ప్రదర్శనలపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. అర్బన్ నక్సల్స్ పన్నిన కుట్ర వలలో విద్యార్థులు చిక్కుకోవద్దని హితవు పలికారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం అర్బన్ నక్సల్స్, ఇతర రాజకీయ పార్టీలు విద్యార్థుల భుజం మీద తుపాకీ ఉంచి కాల్చడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఏ అంశంలోనైనా ప్రభుత్వంతో ప్రజాస్వామ్యయుతంగా చర్చలు జరపవచ్చునని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment