న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లుపై కొన్ని రాజకీయ పార్టీలు పాకిస్తాన్ రాగాన్నే ఆలపిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ బిల్లును వ్యతిరేకించడం సరికాదని హితవు పలికారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు పొరుగు దేశాలైన.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే వీలు కలుగుతుంది. అయితే ఈ బిల్లు వల్ల లౌకిక రాజ్య భావనకు భంగం కలుగుతుందని కాంగ్రెస్ పార్టీ సహా ఇతర ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ బిల్లు రాజ్యాంగాన్ని ఉల్లంఘించేదిగా ఉందంటూ మండిపడుతున్నాయి.
ఈ క్రమంలో ఆందోళనల మధ్య పౌరసత్వ సవరణ బిల్లును నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడుతూ... ‘ పౌరసత్వ బిల్లు ద్వారా విదేశాల్లో శరణార్థులుగా ఉన్న ఎంతో మందికి ఊరట లభిస్తుంది. ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ బిల్లు. అయితే కొన్ని పార్టీలు మాత్రం ఈ బిల్లుపై పాకిస్తాన్ తీరునే అనుసరిస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు. ఇక లోక్‌సభలో భారీ మెజారిటీ ఉన్న బీజేపీకి రాజ్యసభలో సంఖ్యా బలం తక్కువగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో బిల్లు ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. కాగా పౌరసత్వ సవరణ బిల్లుపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మండిపడిన విషయం తెలిసిందే. ఈ బిల్లుతో భారత్ అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించిందని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ బిల్లుతో పాకిస్తాన్‌తో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందానికి భారత్ తూట్లు పొడిచిందని విమర్శించారు. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో సైతం ఈ బిల్లుకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment