Citizenship Law Reform
-
కామసూత్రలో ‘పౌరసత్వం’
న్యూఢిల్లీ : పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా ప్రజాందోళనలు చెలరేగుతున్న విషయం తెల్సిందే. అసలు పౌరసత్వం అంటే ఏమిటీ? దాన్ని మొదట ఎవరు నిర్వచించారు. దాని నిర్వచనం ఎలా మారుతూ వచ్చింది. ఎక్కడైనా మతాల ప్రాతిపదికన పౌరసత్వం ఇచ్చే చట్టాలున్నాయా? పౌరసత్వం అనే దృక్పథాన్ని ప్రపంచంలో మొట్టమొదట గ్రీస్‌లో అరిస్టాటిల్ తీసుకొచ్చారు. ‘దేశ విధాన చర్చల్లో పాల్గొనే హక్కు లేదా న్యాయ అధికారిగా కొనసాగే హక్కు కలిగి ఉండడాన్ని అరిస్టాటిల్ పౌరసత్వం అన్నారు. గ్రహాంతర వాసులకు, బానిసలకు పౌరసత్వ హక్కులు లేవని కూడా స్పష్టం చేశారు. ఆ తర్వాత పౌరసత్వానికి యూరప్ మేథావులు కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. ఓటు హక్కు కలిగి ఉండడం. దాని ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం నుంచి ప్రయోజనాలను పొందడం, తద్వారా ఎప్పటికప్పుడు జీవన ప్రమాణాలను మెరగుపర్చుకోవడం. వలసదారులకు జాతి, మత, కుల, రంగు ప్రాతిపదకన కాకుండా సమాజానికి, దేశానికి వారు అందించిన శారీరక శ్రమను దృష్టిలో ఉంచుకొని పౌరసత్వం ఇవ్వొచ్చని కూడా యూరప్ మేధావులు సూచించారు. దురదృష్టవశాత్తు భారతీయ పురాణ ఇతిహాసాల్లోగానీ, కౌటిల్యుడు రాసిన ‘అర్ధశాస్త్రం’లో పౌరసత్వానికి నిర్వచనం సూచించలేదు. వాత్సాయనుడు రాసిన ‘కామసూత్ర’లో మాత్రం నాగరికుడు ఎవరు? పేరిట కొంత నిర్వచనం ఉంది. ‘నాగరికుడంటే దుస్తులు, నగలు ధరించే ఇంటి యజమాని. మధ్యాహ్మం వేళ మిత్రులతో కలిసి పిచ్చాపాటి మాట్లాడం, సాయంత్రం వేళ మిత్రులతో కలిసి పాటలతో కాలక్షేపం చేయడం, రాత్రివేళ అలంకరించిన పడక గదిలోకి వెళ్లి తనకు కేటాయించిన యువతితో శృంగారాన్ని కొనసాగించేవాడు’ అన్న నిర్వచనం మాత్రమే ఉంది. దేశం, దేశంలోపల సభ్యత్వం అన్న అంశాలు లేవు. అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి వచ్చిన మైనార్టీ శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్రం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందిగానీ ఆ మూడు దేశాల్లో కూడా మైనారిటీల వ్యతిరేకంగా లేదా మతం ప్రాతిపదికన పౌరసత్వం ఇచ్చే చట్టాలు లేవు. ఇప్పటికే శ్వేత జాతీయులకు అనుకూలంగా వ్యవహరిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, హిందువులకు పౌరసత్వం ఇవ్వమంటూ లేదా హిందువులకు మినహా మిగతా మతాల వారికి పౌరసత్వం కల్పించే ఓ చట్టం తీసుకొస్తే ఎలా ఉంటుందో ‘సీఏఏ’ సమర్థిస్తున్న వాళ్లు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. (చదవండి: నేను ఈ దేశపు పౌరుడినేనా?) -
ప్రజాకోర్టులో పౌరసత్వ చట్టం
నూతన పౌరసత్వ చట్టాన్ని క్షేత్రస్థాయిలో పౌరులు సవాలు చేస్తుండటంతో తూర్పు, ఈశాన్య భారతం తగలబడుతోంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు, నిరసనలు చెలరేగుతుండటంతో దేశం అట్టుడికిపోతోంది. అసోంలో ఎన్నార్సీ, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, రామ మందిరంపై తీర్పు తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం తాజాగా పౌరసత్వ చట్టానికి సవరణలు తీసుకురావడం ఏమంత ఆశ్చర్యం కలిగించదు. ఒక ప్రత్యేక మతానికి చెందిన విదేశీయులకు భారతీయ పౌరసత్వాన్ని ఈ సవరణ బిల్లు సమర్థవంతంగా నిరోధిస్తున్నందున భారత్‌ని హిందూ దేశంగా మల్చాలనే బీజేపీ, ఆరెస్సెస్ ఎజండాను మోదీ ప్రభుత్వం మరింత ముందుకు తీసుకుపోతున్నట్లుగానే కనిపిస్తోంది. పార్లమెంటులో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై చర్చ సాగుతుండగానే అసోం, ఈశాన్య భారత్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ చట్టం తమ ప్రాంత జనాభా కూర్పులో గణనీయ మార్పును తీసుకురావడమే కాక తమ సంస్కృతిపై కూడా దాడికి దిగుతుందని ప్రజలు భయాందోళనలకు గురికావడమే ఈ నిరసనలకు కారణం. పైగా ప్రజా నిరసనలు పశ్చిమ బెంగాల్, న్యూ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని అలీగర్ వంటి మరెన్నో ప్రాంతాలకు విస్తరించడమే కాకుండా నిరసనలను పోలీసులు, భద్రతా బలగాలు తీవ్రంగా అణచివేయడంతో ప్రపంచం మెల్లమెల్లగా ఈ నిరసనలను పరిగణనలోకి తీసుకోవడం మొదలైంది. బంగ్లాదేశ్ మంత్రి భారత పర్యటన రద్దు కావడం, జపాన్ ప్రధాని గౌహతి సందర్శన వాయిదా పడటంతో భారత్‌కు దౌత్యపరంగా తొలి దెబ్బలు తగిలాయి. మరీ ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి విభాగం యుఎన్హెచ్సిఆర్ భారత ప్రభుత్వం తలపెట్టిన పౌరసత్వ చట్టం ‘ప్రాథమికంగానే వివక్షాపూరితం’గా ఉందని తన అసమ్మతిని వ్యక్తం చేయడమే కాకుండా, భారత్ కట్టుబడిన అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణపై సుప్రీంకోర్టు జాగ్రత్తగా వ్యవహరిస్తుందని ఐరాస విభాగం ఆశాభావం వ్యక్తం చేసింది. అమెరికా పాలనాయంత్రాంగం కూడా భారత్‌లో పరిణామాలను నిశి తంగా పరిశీలిస్తున్నట్లు చెప్పింది. ఇక దేశీయంగా చూస్తే మోదీ ప్రభుత్వ హిందుత్వ అనుకూల చర్యకు ప్రతిపక్షాలు పాలి స్తున్న కేరళ, పశ్చిమబెంగాల్, పంజాబ్, చత్తీస్గర్ వంటి రాష్ట్రాలలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టాన్ని తాము అమలుపర్చబోమని ఈ రాష్ట్రాల పాలకులు స్పష్టం చేశారు. దాంతో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడి దేశ సమాఖ్య వ్యవస్థను దెబ్బతీయనుంది. అయితే అటు బీజేపీ, ఇటు కేంద్రప్రభుత్వం ఈ వ్యవహారంలో రాష్ట్రాలకు పెద్దగా పాత్ర ఏమీలేదని, కొత్త పౌరసత్వ నిబంధనల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్దగా పాత్ర లేదని చెబుతూ వస్తున్నాయి. పైగా పౌరసత్వ చట్టం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నందున ప్రతిపక్షాల ఏలుబడిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని ఏమేరకు అడ్డుకుంటాయన్నది చూడాల్సిందే మరి. రాజకీయ పరంగా చూస్తే, పౌరసత్వ చట్టం రూపంలో మతపరంగా ప్రజలను విభజించడం ద్వారా దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న పార్టీలను పాకిస్తాన్ అనుకూల, మైనారిటీల అనుకూల సంస్థలుగా ముద్రించడం ద్వారా బీజేపీ మరింతగా మందుగుండు దట్టించింది. కాగా, ఈ ఘర్షణలకు సంబంధించిన తొలి పరీక్ష పశ్చిమబెంగాల్లోనే జరగనుంది. ఎందుకంటే ఈ రాష్ట్రం లోకి మరింతగా చొచ్చుకుపోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వచ్చే సంవత్సరం ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ పౌరసత్వ చట్టం అంశాన్ని ఇప్పటికే ప్రచారంలోకి తీసుకొచ్చేసింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పౌరసత్వ చట్టంపై రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పథక రచన చేస్తుండగా, బీజేపీ మాత్రం ఇప్పటికే పశ్చిమబెంగాల్లో విజయోత్సవ ర్యాలీలను మొదలుపెట్టేసింది. పైగా, పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి తమతో కలిసి నడవాలంటూ రాష్ట్రంలోని శరణార్థులకు పిలుపునిచ్చేసింది కూడా. కాగా, ఢిల్లీలో జామియా వర్సిటీ విద్యార్థులపై పోలీసుల అమానుష దాడులు దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలకు దారితీయడం గమనార్హం. లక్ష్మణ వెంకట్ కూచి వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు -
పాకిస్తాన్ లాగే మాట్లాడుతున్నారు..
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లుపై కొన్ని రాజకీయ పార్టీలు పాకిస్తాన్ రాగాన్నే ఆలపిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ బిల్లును వ్యతిరేకించడం సరికాదని హితవు పలికారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు పొరుగు దేశాలైన.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే వీలు కలుగుతుంది. అయితే ఈ బిల్లు వల్ల లౌకిక రాజ్య భావనకు భంగం కలుగుతుందని కాంగ్రెస్ పార్టీ సహా ఇతర ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ బిల్లు రాజ్యాంగాన్ని ఉల్లంఘించేదిగా ఉందంటూ మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ఆందోళనల మధ్య పౌరసత్వ సవరణ బిల్లును నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడుతూ... ‘ పౌరసత్వ బిల్లు ద్వారా విదేశాల్లో శరణార్థులుగా ఉన్న ఎంతో మందికి ఊరట లభిస్తుంది. ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ బిల్లు. అయితే కొన్ని పార్టీలు మాత్రం ఈ బిల్లుపై పాకిస్తాన్ తీరునే అనుసరిస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు. ఇక లోక్‌సభలో భారీ మెజారిటీ ఉన్న బీజేపీకి రాజ్యసభలో సంఖ్యా బలం తక్కువగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో బిల్లు ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. కాగా పౌరసత్వ సవరణ బిల్లుపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మండిపడిన విషయం తెలిసిందే. ఈ బిల్లుతో భారత్ అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించిందని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ బిల్లుతో పాకిస్తాన్‌తో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందానికి భారత్ తూట్లు పొడిచిందని విమర్శించారు. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో సైతం ఈ బిల్లుకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. -
#CAB2019: మరోసారి ఆలోచించండి!
పట్నా: లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వడంపై జేడీ(యు)లో నిరసన గళాలు విన్పిస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అసంతృప్తి వ్యక్తం చేయగా.. జాతీయ అధికార ప్రతినిధి పవన్ కే వర్మ కూడా తాజాగా నిరసన గళం విప్పారు. పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతుపై పునరాలోచన చేయాలని జేడీ(యు) జాతీయ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు వర్మ సూచించారు. ‘పౌరసత్వ సవరణ బిల్లు(#CAB2019)కు రాజ్యసభలో మద్దతు ఇచ్చే విషయంలో మరోసారి ఆలోచించాలని నితీశ్ కుమార్‌ను కోరుతున్నాను. ఈ బిల్లు రాజ్యాంగం విరుద్ధంగా, వివక్షతో పాటు దేశ ఐక్యమత్యం, సౌభ్రాతృత్వానికి వ్యతిరేకంగా ఉంది. జేడీ(యు) లౌకిక సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉంది. గాంధీజీ ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకించార’ని పవన్ కే వర్మ మంగళవారం ట్వీట్ చేశారు. జేడీ(యు)కు లోక్‌సభలో 16 మంది, రాజ్యసభలో 6 మంది ఎంపీలు ఉన్నారు. కాగా, మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించే పౌరసత్వ సవరణ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇవ్వడం నిరాశ కలిగించిందని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. అయితే ఈ బిల్లుకు లౌకికవాదానికి వ్యతిరేకంగా లేదనందువల్లే తాము మద్దతు ఇచ్చామని జేడీ(యు) ఎంపీ రాజీవ్ రంజన్ అలియాస్ లాలన్ సింగ్ లోక్‌సభలో చెప్పారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బిల్లును సమర్థించడం మినహా తమకు మరో మార్గం లేదని జేడీ(యు) సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఎన్ఆర్సీ, పౌరసత్వ బిల్లును మొదటి నుంచి వ్యతిరేకించి చివరకు జేడీ(యు) మద్దతు పలకడం తమకు ఆశ్చర్యం కలిగించలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ‘యూటర్న్ తీసుకోవడం జేడీ(యు)కు కొత్త కాదని, గతంతో మూడు సార్లు ఈవిధంగా చేసింది. ట్రిఫుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు సమయంలో ఎలా వ్యవహరించిందో ఇప్పుడు పౌరసత్వ బిల్లుపై అదే విధంగా ప్రవర్తించింది. బీజేపీ ప్రవేశపెట్టిన అంశాలను వ్యతిరేకిస్తున్నట్టుగా ప్రజలు, ఓటర్లలో భ్రమలు కల్పిస్తుంది. చివరకు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఓటింగ్ దూరంగా ఉండటమో లేదా సమర్థించమో చేస్తుంద’ని ఏఎన్ సిన్హా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ రాజకీయ విశ్లేషకుడు డీఎం దివాకర్ పేర్కొన్నారు. (మా పార్టీ వైఖరిపై నిరాశ చెందా : పీకే) -
పౌరసత్వ బిల్లుపై రాహుల్ ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఈ బిల్లు దేశ పునాదులను ధ్వంసం చేస్తుందని దుయ్యబట్టారు. మహారాష్ట్రలో తమ కొత్త భాగస్వామ్య పక్షం శివసేన పౌరసత్వ బిల్లు దేశ ప్రయోజనాలను పరిరక్షిస్తుందని ప్రశంసించిన నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పౌరసత్వ సవరణ బిల్లును రాజ్యాంగంపై దాడిగా రాహుల్ అభివర్ణించారు. ఈ బిల్లుపై సర్కార్‌ను సమర్ధించిన వారు దేశ పునాదులను విచ్ఛిన్నం చేయడానికి సహకరించిన వారవుతారని రాహుల్ ట్వీట్ చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్‌ల నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్ధులకు భారత పౌరసత్వం కల్పించేందుకు వెసులుబాటు ఇచ్చిన పౌరసత్వ సవరణ బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది. మరోవైపు మహారాష్ట్రలో పాలక సంకీర్ణ సర్కార్‌కు సారథ్యం వహిస్తున్న శివసేన వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతిచ్చింది. జాతి ప్రయోజనాల కోసం తాము ఈ బిల్లుకు మద్దతిచ్చిందని ఆ పార్టీ నేత, ఎంపీ అర్వింద్ సావంత్ చెప్పారు. -
అందుకే ఆ బిల్లుకు మద్దతు: శివసేన
ముంబై: పౌరసత్వ సవరణ బిల్లుపై శివసేన పార్టీ బీజేపీని తీవ్రంగా విమర్శించింది. అయితే సోమవారం బీజేపీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుకు అనూహ్యంగా శివసేన మద్దతు పలికింది. ఈ బిల్లు ద్వారా హిందువులు, ముస్లిముల మధ్య ‘అదృశ్య విభజన’ సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సోమవారం శివసేన తన అధికారపత్రిక సామ్నాలో సంపాదకీయం ప్రచురించిన విషయం తెలిసిందే. కానీ అదే రోజు శివసేన పార్టీ పౌరసత్వ బిల్లుపై యూటర్న్ తీసుకుంది. ఈ విషయంపై స్పందించిన శివసేన ఎంపీ అరవింద్ సావంత్.. దేశ ప్రయోజనాల కోసం ఈ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇచ్చిందని తెలిపారు. దీంతోపాటు ‘కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ)’ అనేది కేవలం మహారాష్ట్ర రాజకీయాల వరకే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. సిద్ధాంత పరంగా చాలా వ్యత్యాసాలు ఉన్న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి.. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ‘మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వం’ ఏర్పటు చేసిన విషయం తెలిసిందే. శివసేన పార్టీ.. ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కోసం తమ పార్టీ ఎంపీకి బీజేపీ ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రి పదవి కూడా వదులుకుంది. బీజేపీ ప్రతిపాదిస్తున్న పౌరసత్వ సవరణ బిల్లుతో దేశంలో మత యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందని సామ్నా తన సంపాదకీయంలో పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన శివసేన పార్టీకి.. పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా శివసేన పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వటం వల్ల మహారాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి ప్రభావం ఉంటుందన్న మీడియ ప్రశ్నకు.. ‘అది శివసేన పార్టీనే అడగాలి’ అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వివరణ ఇచ్చారు. -
పౌరసత్వ సవరణ బిల్లుపై ఇమ్రాన్ ఫైర్
ఇస్లామాబాద్: పౌరసత్వ సవరణ బిల్లుకు భారత లోక్‌సభ ఆమోదం తెలపడాన్ని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. ఈ బిల్లు ద్వారా అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని భారత్ ఉల్లంఘించిందని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ బిల్లుతో పాకిస్తాన్‌తో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందానికి భారత్ తూట్లు పొడిచిందని విమర్శించారు. అదే విధంగా బీజేపీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను సైతం ఇమ్రాన్ తప్పుబట్టారు. హిందూ రాష్ట్ర భావనను విస్తరించేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుందంటూ ఆరెస్సెస్ వ్యాఖ్యానించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. వాడి, వేడి చర్చల మధ్య స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ చేపట్టగా బిల్లుకు అనుకూలంగా 311, వ్యతిరేకంగా 80 మంది సభ్యులు ఓటేశారు. దీంతో మూడు పొరుగు దేశాలు.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్లైంది. (పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం) ఇక ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుపై చర్చకు సమాధానమిస్తూ హోంమంత్రి అమిత్ షా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. విపక్ష విమర్శలను తిప్పికొట్టారు. ‘రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారమే ఈ బిల్లు ఉంది. సమానత్వ హక్కును కల్పించే ఆర్టికల్ 14 సహా రాజ్యాంగంలోని ఏ అధికరణకు కూడా ఈ బిల్లు ఉల్లంఘన కాదు’ అని అన్నారు. భారత్‌లోని ముస్లింలకు ఈ బిల్లుతో ఏ విధమైన సంబంధం లేదని, ప్రధానిగా మోదీ ఉన్నంతవరకు మైనారిటీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమిత్ షా హామీ ఇచ్చారు. -
రోహింగ్యాలకు నో.. ఎన్నార్సీకి ఎస్
-
పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. వాడి, వేడి చర్చ అనంతరం, విపక్ష సభ్యుల నిరసనల మధ్య బిల్లుపై స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్‌లో అనుకూలంగా 311, వ్యతిరేకంగా 80 ఓటేశారు. దాంతో, మూడు పొరుగు దేశాలు.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్తైంది. అంతకుముందు, పలువురు ఎంపీల సవరణ ప్రతిపాదనలను సభ మూజువాణి ఓటుతో తోసిపుచ్చింది. ఈ బిల్లుపై సభలో దాదాపు 7 గంటల పాటు చర్చ జరిగింది. అనంతరం, చర్చకు సమాధానమిస్తూ హోంమంత్రి అమిత్ షా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. విపక్ష విమర్శలను తిప్పికొట్టారు. ‘రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారమే ఈ బిల్లు ఉంది. సమానత్వ హక్కును కల్పించే ఆర్టికల్ 14 సహా రాజ్యాంగంలోని ఏ అధికరణకు కూడా ఈ బిల్లు ఉల్లంఘన కాదు’ అని అన్నారు. భారత్‌లోని ముస్లింలకు ఈ బిల్లుతో ఏ విధమైన సంబంధం లేదని, ప్రధానిగా మోదీ ఉన్నంతవరకు మైనారిటీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. రోహింగ్యాలకు నో.. ఎన్నార్సీకి ఎస్ రోహింగ్యాలకు పౌరసత్వం కల్పించే ప్రసక్తే లేదని అమిత్ షా మరోసారి తేల్చిచెప్పారు. దేశవ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. పొరుగుదేశాల్లో మతపరమైన వేధింపులకు గురై భారత్‌కు వచ్చి, బాధాకర జీవనం గడుపుతున్నవారికి ఊరట కల్పించేందుకే ఈ బిల్లును తీసుకువచ్చామన్నారు. 1947లో మత ప్రాతిపదికన దేశ విభజన జరిగి ఉండకపోతే.. ఇప్పుడు ఈ బిల్లు అవసరమే ఉండేది కాదని అమిత్ షా వ్యాఖ్యానించారు. ‘పాక్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల్లో మత వివక్ష ఎదుర్కొంటూ 2014, డిసెంబర్ 31 లోపు భారత్‌కు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులను అక్రమ శరణార్ధులుగా భావించం. వారికి భారత పౌరసత్వం కల్పిస్తాం’ అని ఆ బిల్లులో పేర్కొన్నారు. బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. శతాబ్దాల సంప్రదాయమైన ఆత్మీయీకరణ, మానవీయతలో భాగంగానే ఈ బిల్లు రూపొందిందన్నారు. డివిజన్ ఓట్‌తో.. అంతకుముందు, విపక్షాల తీవ్ర నిరసనల మధ్య ఈ బిల్లును అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు, మతహింస ఎదుర్కొన్న ముస్లిమేతరులకు భారతీయ పౌరసత్వం కల్పించే ఈ ప్రతిపాదనకు 130 కోట్ల భారతీయుల ఆమోదం ఉందని ఈ సందర్భంగా షా స్పష్టం చేశారు. డివిజన్ ఓట్ అనంతరం బిల్లును సభలో ప్రవేశపెట్టారు. డివిజన్ వోట్లో అనుకూలంగా 293 ఓట్లు, వ్యతిరేకంగా 82 ఓట్లు వచ్చాయి. రాజ్యాంగ విరుద్ధమని, ముస్లింలకు వ్యతిరేకమని విపక్ష సభ్యులు ఆధిర్ రంజన్ చౌధురి(కాంగ్రెస్), సౌగత రాయ్(టీఎంసీ), ఎన్కే ప్రేమ్‌చంద్రన్(ఆర్ఎస్పీ), గౌరవ్ గొగొయి(కాంగ్రెస్), శశిథరూర్(కాంగ్రెస్), అసదుద్దీన్ ఒవైసీ(ఎంఐఎం) తదితరులు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లును ప్రవేశపెడ్తూ.. కాంగ్రెస్‌పై షా మండిపడ్డారు. ‘శరణార్ధులు, చొరబాటుదారుల మధ్య తేడాను మనమంతా గుర్తించాల్సి ఉంది. ఈ బిల్లు ఎవరికీ వ్యతిరేకం కాదు.ఎవరి హక్కులనూ లాక్కోదు’ అని అన్నారు. ‘ఇన్నర్ లైట్ పర్మిట్’లోకి మణిపూర్ ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల ఆందోళనలపై స్పందిస్తూ.. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ఈశాన్య ప్రాంత ప్రజల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉందని షా తెలిపారు. ఈ బిల్లు పరిధిలో లేని ‘ఇన్నర్ లైన్ పర్మిట్’ ప్రాంతంలోకి మణిపూర్‌ను కూడా చేరుస్తున్నామన్నారు. మూడు పొరుగుదేశాల్లో మత వేధింపులను ఎదుర్కొన్న ముస్లిమేతరులకు రేషన్ కార్డ్ సహా ఎలాంటి పత్రాలు లేనప్పటికీ.. భారతీయ పౌరసత్వం కల్పిస్తామన్నారు. గతంలోనూ ఇలాంటి హక్కులు కల్పించారని, ఆ కారణంగానే ప్రస్తుత పాకిస్తాన్ నుంచి వచ్చిన మన్మోహన్ సింగ్ ప్రధాని, ఎల్కే అడ్వాణీ ఉప ప్రధాని కాగలిగారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సభలో వాడివేడి చర్చ చోటు చేసుకుంది. ఈ బిల్లు లౌకికత అనే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు మనీశ్ తివారీ విమర్శించారు. ‘సమానులను సమానం కాని వారుగా గుర్తించకూడదు. భారత్‌కు ఎవరు వచ్చినా వారు శరణార్ధులే. మతం ప్రాతిపదికన వారిని వేరువేరుగా చూడకూడదు’ అన్నారు. బిల్లుకు ఎన్డీయే మిత్ర పక్షాలైన జేడీయూ, ఎల్జేపీలు మద్దతు తెలిపాయి. ఈ బిల్లులో ముస్లింలను కూడా చేర్చాలని, బిల్లుకు మద్దతు తెలుపుతూ వైఎస్సార్సీపీ, బిజూ జనతాదళ్ సూచించాయి. ఈ బిల్లును వ్యతిరేకించే వారంతా హిందూ వ్యతిరేకులు అనే ప్రచారాన్ని ప్రభుత్వం చేస్తోందని కాంగ్రెస్ సభ్యుడు ఆధిర్ రంజన్ చౌధురి విమర్శించారు. ‘ఈ బిల్లు వివక్షాపూరితం. రాజ్యాంగ పునాదులనే ఇది దెబ్బతీస్తుంది. హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే దిశగా ఇది తొలి అడుగు’ అని మండిపడ్డారు. మా రాష్ట్రంలో ఒప్పుకోం: మమత... ఈ బిల్లును కానీ, జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ)ని కానీ తమ రాష్ట్రంలో అనుమతించబోమని పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ పునరుద్ఘాటించారు. పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడ్తున్న నేపథ్యంలో.. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ బిల్లుపై ఆందోళనలు ఊపందుకున్నాయి. బిల్లు ప్రతిని చించేసిన ఒవైసీ పౌరసత్వ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. తన ప్రసంగం చివరలో ఈ బిల్లు ప్రతిని చించేశారు. ‘ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాను. మేమూ మనుషులమే. ఈ వివక్షకు కారణమేంటి? అస్సాం ఎన్ఆర్సీలో 19 లక్షల మంది పేర్లు లేవు. ముస్లింలకు స్వదేశమంటూ లేకుండా చేయడం వీరి ఉద్దేశం. రెండోసారి విభజన జరగాలని మీరు కోరుకుంటున్నారా? ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది’ అంటూ ప్రతిని చించేసి తన ప్రసంగాన్ని ముగించారు. -
లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ బిల్లుపై లోక్‌సభలో సోమవారం వాడివేడి చర్చ జరిగింది. చర్చ అనంతరం పౌరసత్వ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు ఓటింగ్ నిర్వహించారు. సవరణ బిల్లును ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 293 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 82 ఓట్లు వచ్చాయి. ఓటింగ్ అనంతరం లోక్‌సభలో బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంతకుముందు పౌరసత్వ సవరణ బిల్లును విపక్షాలు వ్యతిరేకించాయి. ఈ బిల్లు ప్రవేశపెడితే ఇండియా ఇజ్రాయిల్‌గా మారుతుందని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను హిట్లర్‌తో పోలుస్తూ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. ఇక బిల్లును వ్యతిరేకించాలని టీఆర్ఎస్ తమ సభ్యులకు విప్ జారీ చేసింది. కాగా పౌరసత్వ సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మతం పేరుతో కాంగ్రెస్ దేశాన్ని విభజించిందని ఆరోపించారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లింలకు ఈ బిల్లు ద్వారా పౌరసత్వం కల్పిస్తామని పేర్కొన్నారు. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌ల్లో హిందువులు, సిక్కులు వివక్షను ఎదుర్కొంటున్నారని అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్‌ల నుంచి భారత్‌కు వచ్చే ముస్లిమేతర శరణార్ధులకు భారత పౌరసత్వం కల్పించేలా పౌరసత్వ సవరణ బిల్లును కేంద్రం చేపట్టింది. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, దేశ లౌకిక స్ఫూర్తికి భంగకరమని కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. -
పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారతీయ సంతతి ప్రజలు(పీఐఓ), విదేశాల్లోని భారతీయ పౌరులు(ఓసీఐ).. ఈ రెండు విభాగాలను విలీనం చేసేందుకు ఉద్దేశించిన పౌరసత్వ చట్టం(సవరణ) బిల్లును.. జనవరి 6న కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్సు స్థానంలో సభలో ప్రవేశపెట్టనున్నారు. 2022 సంవత్సరంలోగా అందరికీ ఇళ్లు లక్ష్యంతో రూపొందించిన జాతీయ పట్టణ గృహనిర్మాణ పథకంపై చర్చను కేబినెట్ ప్రస్తుతానికి వాయిదా వేసింది. అలాగే, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్బంగా రాష్ట్రపతి ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి చేసే ప్రసంగ పాఠాన్ని కూడా కేబినెట్ ఆమోదించింది. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ నినాదం స్ఫూర్తి ప్రతిబింబించేలా.. ఎన్డీయే ప్రభుత్వ పథకాలను, విధానాలను వివరిస్తూ సోమవారం(ఫిబ్రవరి 23న) రాష్ట్రపతి ప్రసంగం సాగేలా కేబినెట్ భేటీలో తుది మెరుగులు దిద్దారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టాలనుకుంటున్న బిల్లులను, సభ ఆమోదం పొందాల్సి ఉన్న ఆర్డినెన్సులను కూడా రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావిస్తారు.