
న్యూఢిల్లీ : పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా ప్రజాందోళనలు చెలరేగుతున్న విషయం తెల్సిందే. అసలు పౌరసత్వం అంటే ఏమిటీ? దాన్ని మొదట ఎవరు నిర్వచించారు. దాని నిర్వచనం ఎలా మారుతూ వచ్చింది. ఎక్కడైనా మతాల ప్రాతిపదికన పౌరసత్వం ఇచ్చే చట్టాలున్నాయా?
పౌరసత్వం అనే దృక్పథాన్ని ప్రపంచంలో మొట్టమొదట గ్రీస్‌లో అరిస్టాటిల్ తీసుకొచ్చారు. ‘దేశ విధాన చర్చల్లో పాల్గొనే హక్కు లేదా న్యాయ అధికారిగా కొనసాగే హక్కు కలిగి ఉండడాన్ని అరిస్టాటిల్ పౌరసత్వం అన్నారు. గ్రహాంతర వాసులకు, బానిసలకు పౌరసత్వ హక్కులు లేవని కూడా స్పష్టం చేశారు. ఆ తర్వాత పౌరసత్వానికి యూరప్ మేథావులు కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. ఓటు హక్కు కలిగి ఉండడం. దాని ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం నుంచి ప్రయోజనాలను పొందడం, తద్వారా ఎప్పటికప్పుడు జీవన ప్రమాణాలను మెరగుపర్చుకోవడం. వలసదారులకు జాతి, మత, కుల, రంగు ప్రాతిపదకన కాకుండా సమాజానికి, దేశానికి వారు అందించిన శారీరక శ్రమను దృష్టిలో ఉంచుకొని పౌరసత్వం ఇవ్వొచ్చని కూడా యూరప్ మేధావులు సూచించారు.
దురదృష్టవశాత్తు భారతీయ పురాణ ఇతిహాసాల్లోగానీ, కౌటిల్యుడు రాసిన ‘అర్ధశాస్త్రం’లో పౌరసత్వానికి నిర్వచనం సూచించలేదు. వాత్సాయనుడు రాసిన ‘కామసూత్ర’లో మాత్రం నాగరికుడు ఎవరు? పేరిట కొంత నిర్వచనం ఉంది. ‘నాగరికుడంటే దుస్తులు, నగలు ధరించే ఇంటి యజమాని. మధ్యాహ్మం వేళ మిత్రులతో కలిసి పిచ్చాపాటి మాట్లాడం, సాయంత్రం వేళ మిత్రులతో కలిసి పాటలతో కాలక్షేపం చేయడం, రాత్రివేళ అలంకరించిన పడక గదిలోకి వెళ్లి తనకు కేటాయించిన యువతితో శృంగారాన్ని కొనసాగించేవాడు’ అన్న నిర్వచనం మాత్రమే ఉంది. దేశం, దేశంలోపల సభ్యత్వం అన్న అంశాలు లేవు.
అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి వచ్చిన మైనార్టీ శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్రం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందిగానీ ఆ మూడు దేశాల్లో కూడా మైనారిటీల వ్యతిరేకంగా లేదా మతం ప్రాతిపదికన పౌరసత్వం ఇచ్చే చట్టాలు లేవు. ఇప్పటికే శ్వేత జాతీయులకు అనుకూలంగా వ్యవహరిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, హిందువులకు పౌరసత్వం ఇవ్వమంటూ లేదా హిందువులకు మినహా మిగతా మతాల వారికి పౌరసత్వం కల్పించే ఓ చట్టం తీసుకొస్తే ఎలా ఉంటుందో ‘సీఏఏ’ సమర్థిస్తున్న వాళ్లు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. (చదవండి: నేను ఈ దేశపు పౌరుడినేనా?)
Comments
Please login to add a commentAdd a comment