ముంబై: పౌరసత్వ సవరణ బిల్లుపై శివసేన పార్టీ బీజేపీని తీవ్రంగా విమర్శించింది. అయితే సోమవారం బీజేపీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుకు అనూహ్యంగా శివసేన మద్దతు పలికింది. ఈ బిల్లు ద్వారా హిందువులు, ముస్లిముల మధ్య ‘అదృశ్య విభజన’ సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సోమవారం శివసేన తన అధికారపత్రిక సామ్నాలో సంపాదకీయం ప్రచురించిన విషయం తెలిసిందే. కానీ అదే రోజు శివసేన పార్టీ పౌరసత్వ బిల్లుపై యూటర్న్ తీసుకుంది. ఈ విషయంపై స్పందించిన శివసేన ఎంపీ అరవింద్ సావంత్.. దేశ ప్రయోజనాల కోసం ఈ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇచ్చిందని తెలిపారు. దీంతోపాటు ‘కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ)’ అనేది కేవలం మహారాష్ట్ర రాజకీయాల వరకే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
సిద్ధాంత పరంగా చాలా వ్యత్యాసాలు ఉన్న శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి.. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ‘మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వం’ ఏర్పటు చేసిన విషయం తెలిసిందే. శివసేన పార్టీ.. ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కోసం తమ పార్టీ ఎంపీకి బీజేపీ ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రి పదవి కూడా వదులుకుంది. బీజేపీ ప్రతిపాదిస్తున్న పౌరసత్వ సవరణ బిల్లుతో దేశంలో మత యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందని సామ్నా తన సంపాదకీయంలో పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన శివసేన పార్టీకి.. పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా శివసేన పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వటం వల్ల మహారాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి ప్రభావం ఉంటుందన్న మీడియ ప్రశ్నకు.. ‘అది శివసేన పార్టీనే అడగాలి’ అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment