
అమర్ నాథ్ యాత్రకు మరో బ్యాచ్!
జమ్మూః అమర్ నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. ఇప్పటికే ఈ సంవత్సరం యాత్ర మొదలైనప్పటినుంచీ ఎన్నో ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్న యాత్రలో .. 265 మంది భక్తులతో కూడిన మరో బ్యాచ్.. తమ ప్రయాణాన్ని జమ్మూ నుంచీ సోమవారం సాయంత్రం ప్రారంభించింది. జమ్మూలోని భగవతి నగర్ యాత్రీనివాస్ నుంచి భక్తులను కట్టుదిట్టమైన భద్రతా చర్యలమధ్య యాత్రకు తరలిస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు.
ఈ సంవత్సరం అమర్ నాథ్ యాత్ర ప్రారంభమైనప్పటినుంచీ అడుగడుగునా అడ్డంకులు ఎదురౌతూనే ఉన్నాయి. కశ్మీర్ లోయలో ఆందోళనల కారణంగా యాత్రలో పలుమార్లు బ్రేక్ లు పడుతూనే ఉన్నాయి. లోయలో కర్ఫ్యూ కారణంగా అమర్ నాథ్ యాత్రకు వెళ్ళిన భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా సోమవారం సాయంత్రం 265 మంది భక్తులతో కూడిన మరో బృందం... జమ్మూనుంచి యాత్రను పటిష్ట భద్రత మధ్య ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. యాత్రికులు అమర్ నాథ్ దర్శనానికి వెళ్ళేందుకు దాటాల్సిన బల్తాల్, పహల్గమ్ బేస్ క్యాంపులకు చేరేందుకు జమ్మూ కశ్మీర్ రహదారి నుంచీ ప్రయాణం సాగిస్తారు. ఈ రహదారిలో ట్రాఫిక్ ను కేవలం రాత్రి సమయంలోనే అనుమతిస్తారు.
జూలై 8న హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వాని ఎన్ కౌంటర్ అనంతరం చెలరేగిన అల్లర్లు, నిరసనల నేపథ్యంలో పగటిపూట జమ్మూ-కశ్మీర్ రహదారిపై ప్రయాణం కొంత అస్తవ్యస్తంగానే మారింది. ఆందోళనకారులు ట్రాఫిక్ ను నిలిపివేస్తుండటంతో.. లోయకు చేరుకునే యాత్రికుల సంఖ్య జూలై 2న ప్రారంభమైనప్పటినుంచీ రోజురోజుకూ క్రమంగా తగ్గుతూ వస్తోంది. అయినప్పటికీ ఈ సంవత్సరం యాత్ర ప్రారంభమైనప్పటినుంచీ ఇప్పటివరకూ 2,20,000 మంది భక్తులు పుణ్యక్షేత్ర దర్శనం పూర్తి చేసుకోగా.. 265 మందితో కూడిన మరో భక్తుల బృందం యాత్రను సోమవారం ప్రారంభించింది. ఆగస్టు 17తో ఈసారికి అమర్ నాథ్ యాత్ర ముగుస్తుంది. కాగా ఈయేడు సుమారు 21 మంది వరకూ భక్తులు వాతావరణ ప్రతికూలత కారణంగా మృతి చెందడం యాత్రలో కొంత ఆందోళన రేపింది.