
సాక్షి, న్యూఢిల్లీ : నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) బుధవారం సంచలనాత్మక ఆదేశాలు జారీ చేసింది. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు ఎన్‌జీటీ ఆదేశాలు అశనిపాతం లాంటివే. అమర్‌నాథ్ యాత్రలోనూ, అమర్‌నాథ్ గుహలోని భక్తులు భంభం బోలే అంటూ నినదించడం, బిగ్గరగా మంత్రాలు పఠించడం, పరమేశ్వరుడి దగ్గర గంట కొట్టడాన్ని ఎన్‌జీటీ నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక యాత్ర చివరి చెక్‌పాయింట్ నుంచి అమర్‌నాథ్ గుహ వరకూ భక్తులను గుంపులుగా కాకుండా.. ఒకే వరుసలో పంపాలని అమర్‌నాథ్ బోర్డుకు ఎన్‌జీటీ ఆదేశాలు జారీ చేసింది.
అమర్‌నాథ్ కొండ ప్రాంతాన్ని ‘సైలెన్స్ జోన్’గా ఎన్‌జీటీ ప్రకటించింది. అమర్‌నాథ్ గుహ ఉన్న ప్రాంతం.. మంచుతో కూడుకుని సహజ ప్రకృతితో ఉండే ఈ ప్రాంతాన్ని పరిరక్షించేదుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అమర్‌నాథ్ బోర్డు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది.
అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, మంచు లింగాన్నిదర్శించుకునే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్‌జీటీ ఆదేశించింది. భక్తులను వ్యాపారాత్మక దృష్టితో చూడడం అమర్‌నాథ్ బోర్డుకు మంచిది కాదని ఎన్‌జీటీ తెలిపింది.