సాక్షి, న్యూఢిల్లీ : దేశ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా అస్సాంలో కొనసాగుతున్న ప్రజాందోళనలో మహిళలే ముందున్నారు. నాడు 16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తుల దురాక్రమణకు వ్యతిరేకంగా అహోం రాజుల తరఫున వీరోచితంగా పోరాడి అసువులు బాసిన వీర వనిత మూల గభోరుతో నేటి మహిళలను పోలుస్తున్నారు. ‘సరాయిఘాట్’ యుద్ధంగా చరిత్రలో నిలిచిపోయిన నాటి యుద్ధంలో బెంగాల్ సుల్తాన్ జనరల్ టర్బక్ ఖాన్‌ను గబోరు నాయకత్వాన మహిళలు తరమితరమి కొట్టారు.
నేటి సీఏఏ వ్యతిరేక ఆందోళనలో ప్రతి మహిళా ఒక మూల గభోరు కావాలని సామాజిక, కళారంగాలకు చెందిన ప్రముఖులు పిలుపునిస్తున్నారు. ముఖ్యంగా సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పెద్ద పెద్ద ర్యాలీలలో అస్సాం సినీ నటి బార్షా రాణి బిషాయ ప్రముఖ ఆకర్షణగా మారారు. ఆమెను మూల గభోరుగా ప్రముఖ అస్సాం, హిందీ చలన చిత్రాల దర్శకుడు పద్మశ్రీ జాహ్ను బారువా పోల్చారు. ఆదివారం నాడు గువాహటిలోని లతాసిల్ ప్లేగ్రౌండ్ నుంచి చాంద్‌మారి సెంటర్ వరకు కొనసాగిన ఆందోళనలో పద్మశ్రీ జాహ్ను గట్టిగా నినాదాలు చేస్తూ అందరిని ఆకర్షించారు. ఆమెకు అండగా ప్రముఖ డిజైనర్ గరిమా గార్గ్ సైకియా నిలబడ్డారు.
‘కావల్సినంత సమయం ఉన్నప్పటికీ మీ కాలంలో మీరేమీ చేయలేకపోవడంవల్ల నేడు మేము ఇబ్బందులు పడుతున్నాం. పరాయి వాళ్లు వచ్చి మా భాషను, సంస్కతిని నాశనం చేయడమే కాకుండా నోటికింత ముద్ద దొరక్కుండా మా ఉద్యోగాలను కొల్లగొట్టుకుపోయారు’ అంటూ మన పిల్లలు మనల్ని రేపు నిలదీయకముందే లక్ష్య సాధనలో మనం ముందుకుపోదాం పదంటూ సినీ నటి బార్షా రాణి తోటి మహిళలను ప్రేరేపిస్తున్నారు. 1985లో కేంద్ర ప్రభుత్వం తమ అస్సాం రాష్ట్రంతో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా నేడు కేంద్ర ప్రభుత్వం సీఏఏను ఎలా తీసుకొస్తుందంటూ ఆమె నినదిస్తున్నారు. 1971, మార్చి 24వ తేదీ అర్ధరాత్రికి ముందు భారత్‌కు వచ్చి స్థిరపిడిన వారిని, వారి పిల్లలను మినహా ఆ తర్వాత వచ్చిన వారందరిని విదేశీయులుగానే పరిగణించి అస్సాం నుంచి బయటకు పంపించాలన్నది 1985లో కేంద్రంతో చేసుకున్న అస్సాం ఒప్పందం. ఇప్పుడు ఆ ఒప్పందానికి విరుద్ధంగా బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ నుంచి 2014కు ముందు వచ్చిన ముస్లింలు మినహా మిగతా హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, క్రైస్తవులకు భారత పౌరసత్వం కల్పించేందుకు కేంద్రం సీఏఏ బిల్లును తీసుకొచ్చింది.
నాడు అహోమ్ రాజులు, మొఘల్స్‌కు మధ్య జరిగిన యుద్ధాన్ని హిందూ, ముస్లింల మధ్య జరిగిన యుద్ధంగా చూడలేం. ఎందుకంటే మొగల్స్ సైన్యానికి జైపూర్‌కు చెందిన రాజా రామ్ సింగ్ నాయకత్వం వహించగా, అహోం రాజుల సైన్యానికి అస్సామీస్ ముస్లిం బాగ్ హజోరికా అనే ముస్లిం నాయకత్వం వహించారు. బీజేపీ నేతలు మాత్రం నాటి ‘సరాయిఘాట్’ యుద్ధాన్ని హిందూ, ముస్లింల మధ్య జరిగిన యుద్ధంగా పేర్కొంటూ ‘ఇదే ఆఖరి సరాయి ఘాట్’ యుద్ధమంటూ 2016లో జరిగిన ఎన్నికల్లో ప్రచారం చేయడం ద్వారా బీజేపీ మొట్టమొదటిసారి అస్సాంలో అధికారంలోకి వచ్చింది. ఇక తమ రాష్ట్రంలో బీజేపీకి శాశ్వతంగా నూకలు చెల్లాయని బార్షారాణి నాయకత్వాన అస్సాం మహిళలు నినదిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment